OG Sriya Reddy: నువ్వు చేసిన త్యాగానికి దక్కిన విజయం ఓజీ.. శ్రియా రెడ్డి కామెంట్స్
OG Sriya Reddy: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘ఓజీ’ (OG) ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ సాధించడంతో పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో గీత అనే శక్తివంతమైన పాత్రలో నటించిన శ్రియా రెడ్డి, కోలీవుడ్ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
సుజీత్ చేసిన త్యాగాలు ఈ విజయానికి నిదర్శనం: శ్రియా రెడ్డి
‘ఓజీ’ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన నటి శ్రియా రెడ్డి, దర్శకుడు సుజీత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సుజీత్ గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకుడని, ఈ విజయం ఆయన చేసిన త్యాగాలకు నిదర్శనమని ఆమె అన్నారు. “సుజీత్ రాసిన పాత్ర మరోసారి తెరపై అద్భుతం సృష్టించింది. ‘ఓజీ’ లాంటి భారీ ప్రాజెక్టును తీసుకుని దానిని విజయవంతం చేయాలంటే ఆత్మవిశ్వాసం ఉన్న దర్శకుడు అవసరం. సుజీత్ అలాంటి దర్శకుడే. నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో మీరూ ఒకరు. ఈ విజయానికి మీరు పూర్తిగా అర్హులు. మీ కృషి, విశ్వాసం, మీరు చేసిన త్యాగాలు ఈ విజయానికి నిదర్శనం” అంటూ శ్రియా రెడ్డి తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.
తెలుగు ప్రేక్షకుల మధ్య సినిమా చూస్తేనే అసలైన మజా: ప్రదీప్ రంగనాథన్
మరోవైపు, కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ సైతం ‘ఓజీ’ చిత్రాన్ని చూసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకుల మధ్య ఈ మాస్ చిత్రాన్ని చూస్తేనే అసలైన ఆనందం లభిస్తుందని అన్నారు. థియేటర్‌లో సినిమా చూస్తున్న వీడియోను పంచుకుంటూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.