OG Movie Collections: ‘ఓజీ’ సంచలనం.. తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు.. ఎంతంటే?
OG Movie Collections: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 154 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. “ఇది పవన్ కళ్యాణ్ సినిమా. చరిత్రను ఓజీ చెరిపేసింది” అని క్యాప్షన్‌తో కూడిన పవర్‌ఫుల్ పోస్టర్‌ను పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించింది.
పవన్ కల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్
‘ఓజీ’ సాధించిన ఈ తొలి రోజు వసూళ్లు పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఒక కొత్త రికార్డుగా నిలిచాయి. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కొద్ది క్షణాల్లోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ అఖండ విజయంతో, అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘ఓజీ’ చోటు దక్కించుకుంది. టాలీవుడ్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏడో చిత్రంగా ‘ఓజీ’ నిలవడం విశేషం.
ఫ్యాన్స్ ఆశించిన విజయం
పవన్ కల్యాణ్ అభిమాని అయిన దర్శకుడు సుజీత్, ఆయనను ఎలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో అదే స్టైల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించి అందరినీ ఆకట్టుకున్నారు. స్టైలిష్ మేకింగ్, పవన్ లుక్స్, మ్యానరిజం, యాక్షన్ సన్నివేశాలు, అలాగే తమన్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భవిష్యత్తులో ఈ చిత్రానికి కొనసాగింపులు, ఇతర కథానాయకులతో యూనివర్స్‌ను క్రియేట్ చేసే ఆలోచన ఉన్నట్లు దర్శకుడు సుజీత్ ఇప్పటికే వెల్లడించారు. ఈ అద్భుతమైన విజయం పవన్ కల్యాణ్, సుజీత్ కాంబినేషన్ భవిష్యత్తులోనూ మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందని నిరూపించింది.