Siddhu Jonnalagadda: సినిమానేమో అట్టర్ ఫ్లాప్.. అప్పు చేసి మరీ రెమ్యునరేషన్ వెనక్కిచ్చిన సిద్దు జొన్నలగడ్డ..
Siddhu Jonnalagadda: యూత్‌లో భారీ ఫాలోయింగ్‌తో వరుస విజయాలను అందుకుంటూ యూత్ ఐకాన్‌గా ఎదిగిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధుకు, ఇటీవల విడుదలైన ‘జాక్’ చిత్రం నిరాశను మిగిల్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ నష్టాల భారాన్ని తానే మోస్తూ, తన రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చి సిద్ధు జొన్నలగడ్డ తన గొప్ప మనసును చాటుకున్నారు.
నష్టాల భారాన్ని మోస్తూ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధు ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఏకంగా రూ. 4.75 కోట్లు బ్యాంకు లోన్ తీసుకుని నిర్మాతకు తిరిగి ఇచ్చానని, ఇప్పటికీ ఆ లోన్ కడుతున్నానని ఆయన తెలిపారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు నిర్మాత బాధను చూసి తనవంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ నష్టాన్ని తానే భరించాలని నిర్ణయించుకున్నానని సిద్ధు పేర్కొన్నారు. సిద్ధు జొన్నలగడ్డ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
“టిల్లు” ఇమేజ్ నుంచి బయటపడే ప్రయత్నం..
‘జాక్’ ఫ్లాప్ తరువాత, తన “టిల్లు బాయ్” ఇమేజ్ నుంచి బయటపడి కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని సిద్ధు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా, ప్రస్తుతం “తెలుసు కదా” అనే సినిమాలో నటిస్తున్నారు. నీరజ్ కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. ఇందులో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. “తెలుసు కదా” తరువాత కూడా సిద్ధు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
