Chiranjeevi OG: ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. ‘ఓజీ’ సినిమాపై చిరంజీవి కామెంట్స్
Chiranjeevi OG: మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబం కలిసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన తర్వాత చిరంజీవి సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ఓజీ’ అభిమానుల అంచనాలను మించిపోయిందని, పవన్ కల్యాణ్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారని ఆయన అన్నారు.
‘ఓజీ’ హాలీవుడ్ స్థాయి చిత్రం: చిరంజీవి
సినిమా వీక్షించిన తర్వాత చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ‘ఓజీ’ టీమ్‌తో, తన కుటుంబంతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. “కుటుంబంతో కలిసి ‘ఓజీ’ సినిమా చూశాను. సినిమాలోని ప్రతి అంశాన్ని చాలా బాగా ఆస్వాదించాను. ఈ సినిమా నిర్మాణ విలువలు హాలీవుడ్ ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయి. ఇది ఒక అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ కథ. ఇందులో యాక్షన్, భావోద్వేగాలకు ఎలాంటి లోటు లేకుండా దర్శకుడు సుజిత్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగింది. పవన్ కల్యాణ్‌ను తెరపై ఇలా చూడడం చాలా గర్వంగా అనిపించింది. పవన్ తన ప్రత్యేకమైన స్టైల్, నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఓజీ’ ఒక విందు భోజనంలా అనిపించింది” అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అలాగే, ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తమన్ సంగీతం సినిమాకు వెన్నెముక అని, విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. మొత్తంగా చిత్ర బృందానికి తన అభినందనలు తెలిపారు. సినిమా విడుదలైన రోజు కూడా చిరంజీవి ట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్‌ను అందరూ ‘ఓజాస్ గంభీర’గా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
పవన్ కళ్యాణ్ మూవీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఈ సినిమా ఐదు రోజుల వరకు ఇండియాలో 148.82 కోట్ల రూపాయల నెట్.. 176. 12 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఆంధ్రా, నైజాంలలో 148 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 17 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3.50 కోట్ల రూపాయలు, కేరళ + హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 5.23 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది ఓజీ.