Pawan Kalyan: కర్ణాటకలో ‘ఓజీ’కి ఆటంకాలు.. కాంతారకు మాత్రం అలా చేయొద్దన్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ సినిమా టికెట్ ధరలు పెంచేందుకు తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఇటీవల తన సొంత చిత్రం ‘ఓజీ’కి కర్ణాటకలో ఎదురైన ఇబ్బందుల గురించి తెలుగు సినీ వర్గాలు ఆయన దృష్టికి తీసుకురాగా, ఈ విషయంపై ఆయన స్పందించారు. ‘ఓజీ’ సినిమా పోస్టర్లు, బ్యానర్లను కర్ణాటకలో తొలగిస్తున్నారని, అక్కడి ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని సినీ ప్రముఖులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ విషయంపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “కర్ణాటకలో మన చిత్రాలకు ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా, మనం కూడా అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఆపొద్దు. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచించాలి. కన్నడ సినీ ప్రముఖులైన డా. రాజ్‌కుమార్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వంటి వారిని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సోదరభావం ఉంది. మన సినిమాకు కర్ణాటకలో ఎదురవుతున్న సమస్యలపై ఇరు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కలిసి చర్చించుకోవాలి. ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళతాను. కర్ణాటకలో మన సినిమాలకు ఇబ్బందులు ఎదురయ్యాయని ‘కాంతార చాప్టర్ 1’కి ఆటంకాలు కల్పించవద్దు” అని పవన్ కల్యాణ్ కోరారు.
కాగా, తెలుగు సినిమా వర్గాల నుంచి ‘కాంతార చాప్టర్ 1’ టికెట్ ధరల పెంపుపై మొదట కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘గేమ్ చేంజర్’, ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ వంటి తెలుగు చిత్రాలకు కర్ణాటకలో టికెట్ ధరలు పెంచడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వారు వాపోయారు. అలాగే, సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగింపు వంటి సమస్యలను కూడా ప్రస్తావించారు. తెలుగు సినిమాకు అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, కన్నడ చిత్రాలకు టికెట్ ధర పెంపుపై పునరాలోచించాలని వారు కోరారు. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం జాతీయ భావనతో ఆలోచించాలని, సినిమాలకు ఇలాంటి ఆటంకాలు కల్పించవద్దని సూచించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.