Anushka Ghaati: థియేటర్లో పట్టించుకోలేదు.. ఓటీటీలో మాత్రం ఘాటికి మంచి రెస్పాన్స్
Anushka Ghaati: సీనియర్ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఘాటి’ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాపై విడుదలకి ముందు భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. థియేట్రికల్ రిలీజ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం, సెప్టెంబర్ 26 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.
సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో అనుష్క నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఒక పవర్ఫుల్ పాత్రలో ఆమె చూపించిన నటన, ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఆమె ప్రదర్శించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒక పూజా సీన్లో ఆమె నటన తన కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిందని నెటిజన్లు ప్రశంసించారు. కొంతమంది ఆమె అద్భుతమైన నటనను ‘సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లోని అగ్ర నటుల నటనతో పోల్చారు.
అయితే, అనుష్క నటన సినిమాకు బలం చేకూర్చినా, కథ, స్క్రీన్‌ప్లే మాత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాయి. నెమ్మదిగా సాగే కథనం, ఇంటర్వెల్ వరకు సాగదీసిన సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. కొన్ని యాక్షన్ సీన్లు అనుకున్న స్థాయిలో పండలేదని, కథలో కొత్తదనం లేదని ప్రేక్షకులు విమర్శించారు. కొన్ని సన్నివేశాలు పునరావృతమైనట్లు అనిపించాయని, బీజీఎం కొన్ని చోట్ల బాగున్నా, ఎమోషనల్ కంటెంట్‌ను బలంగా తీసుకురావడంలో విఫలమైందని విశ్లేషకులు తెలిపారు.
సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, క్రిష్-అనుష్క కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, సినిమా చూసిన తర్వాత ఆ అంచనాలు అందుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, థియేట్రికల్ రన్‌కి భిన్నంగా, ఓటీటీలో మాత్రం ‘ఘాటి’ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోవడం విశేషం.
