Vijay Deverakonda Rashmika: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక.. పెళ్లి ఎప్పుడంటే?
Vijay Deverakonda Rashmika: టాలీవుడ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా వినిపిస్తున్న ప్రేమ వార్తలకు తెరపడింది. ఎట్టకేలకు ఆ వార్త నిజమైంది. యువ సంచలనం విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నా త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ క్రేజీ జంటకు శుక్రవారం రోజున హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో నిశ్చితార్థ వేడుక అత్యంత నిరాడంబరంగా, వైభవంగా జరిగింది.
రెండు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహంతో ఒక్కటవబోతున్నారని వారి సన్నిహితులు వెల్లడించారు. ఈ నిశ్చితార్థ వార్తతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
‘గీత గోవిందం’ సినిమాతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందని టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆ సినిమాలోని వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ కలిసి నటించి, అభిమానులను అలరించారు. తెరపై వీరి జోడీకి లభించిన అద్భుతమైన స్పందనతో, వీరు నిజజీవితంలోనూ జంటగా మారబోతున్నారనే ఊహాగానాలు అప్పట్నుంచే బలంగా వినిపించాయి.
అధికారికంగా వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఎప్పుడూ మాట్లాడకపోయినా, తరచూ విహార యాత్రలలో కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరి పోస్ట్‌లకు మరొకరు ఇచ్చే రిప్లైలు, ఇతర వేదికలపై వీరిద్దరూ చూపించే చొరవ.. ఈ వార్తలకు బలాన్నిస్తూ వచ్చాయి. ఈ వార్తలను వారు ఎన్నడూ ఖండించకపోవడం గమనార్హం. చివరకు, శుక్రవారం జరిగిన నిశ్చితార్థంతో ఆ వార్తలన్నీ నిజమని తేలిపోయింది.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ నిశ్చితార్థంపై అటు విజయ్ గానీ, ఇటు రష్మిక గానీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయినప్పటికీ, తమ అభిమాన జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతుండటం పట్ల ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు కన్నడ రాష్ట్రంలోనూ ఉన్న అభిమానులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ కొత్త జంటకు సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.