Spirit: స్పిరిట్ కోసం మరో బాలీవుడ్ యాక్టర్.. గట్టిగా ప్లాన్ చేస్తున్న యానిమల్ డైరెక్టర్
Spirit: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆ తర్వాత ‘యానిమల్’తో జాతీయ స్థాయిలో రికార్డులు తిరగరాశారు. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్‌డేట్ అయినా నెట్టింట భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
సందీప్ రెడ్డి వంగా సినిమాలో పాత్ర చిన్నదైనా, ఆ పాత్రకు ఉండే క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది అనడానికి బాబీ డియోల్ ఉదాహరణ. సరైన బ్రేక్ లేక కెరీర్‌లో ఇబ్బందులు పడుతున్న బాబీ డియోల్‌ను ‘యానిమల్’లో పవర్ ఫుల్ విలన్‌గా చూపించి, అతనికి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది సందీప్ రెడ్డి వంగానే.
ఇప్పుడు, అదే సెంటిమెంట్‌ను ‘స్పిరిట్’ కోసం కూడా వంగా ఫాలో అవుతున్నారనే వార్త సినీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మరో బాలీవుడ్ నటుడిని ‘స్పిరిట్’లోకి తీసుకోవాలని వంగా ప్లాన్ చేస్తున్నారట. ఆ నటుడు మరెవరో కాదు.. వివేక్ ఒబెరాయ్.
తెలుగు ప్రేక్షకులకు ‘రక్త చరిత్ర’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాల ద్వారా పరిచయం ఉన్న వివేక్ ఒబెరాయ్, ఇటీవల చెప్పుకోదగిన బ్రేక్ అందుకోలేకపోయారు. తాజా సమాచారం ప్రకారం, సందీప్ రెడ్డి వంగా ఈ టాలెంటెడ్ నటుడిని ‘స్పిరిట్’లో శక్తివంతమైన నెగెటివ్ రోల్‌లో చూపించబోతున్నారట.
ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ గాసిప్‌ను సినీ ప్రేమికులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య ఫైట్ ఎలా ఉంటుందో అని ఇప్పటికే అభిమానులు ఊహించుకోవడం మొదలుపెట్టేశారు. పూర్తి స్థాయి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘స్పిరిట్’పై అంచనాలు భారీగా పెరిగాయి.
