Keerthy Suresh: నటుడు జగపతి బాబుకు కీర్తి సురేశ్ బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
Keerthy Suresh: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘మహానటి’గా పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నటుడు జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో పాల్గొన్న కీర్తి సురేశ్, తన పెళ్లి విషయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించి, జగపతి బాబుకు క్షమాపణలు చెప్పారు.
తన జీవిత భాగస్వామి ఆంథోనీ తటిల్‌తో ప్రేమ ప్రయాణం గురించి మాట్లాడుతూ, తన ప్రేమ గురించి సినీ పరిశ్రమలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునని, ఆ కొద్ది మందిలో జగపతి బాబు కూడా ఉన్నారని కీర్తి సురేశ్ తెలిపారు. “పరిశ్రమలో చాలా తక్కువమందికి నా వ్యక్తిగత విషయాలు తెలుసు. మిమ్మల్ని (జగపతి బాబును) నేను చాలా నమ్మాను, అందుకే నా వ్యక్తిగత విషయాల గురించి మీతో పంచుకున్నాను. కానీ, దురదృష్టవశాత్తు నా పెళ్లికి మిమ్మల్ని ఆహ్వానించలేకపోయాను. ఈ విషయంలో నన్ను క్షమించండి,” అని కీర్తి సురేశ్ బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.
ఆంథోనీతో తమ ప్రేమ ప్రయాణం 15 ఏళ్ల పాటు సాగిందని, ఇందులో ఆరేళ్లు వారిద్దరూ వేరువేరు దేశాలలో (ఖతార్, ఇండియా) ఉండాల్సి వచ్చిందని కీర్తి తెలిపారు. “మా ఇంట్లో వాళ్లు అంగీకరించిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నాలుగేళ్ల క్రితమే ఇంట్లో విషయాన్ని చెప్పాం. మా నాన్నగారు వెంటనే అంగీకరించారు,” అని ఆమె వెల్లడించారు. అంతేకాక, ఇంట్లో చెప్పడానికి కంటే ముందే, ఈ విషయాన్ని జగపతి బాబుకు తెలియజేశానని కీర్తి సురేశ్ గుర్తు చేసుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ తన వ్యక్తిగత అభిమాన నటుడి గురించి కూడా పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన సినిమాలు విడుదలైనప్పుడు కాలేజీకి డుమ్మా కొట్టి మరీ చూసేదానినని సరదాగా చెప్పారు.