రైతు జన సంక్షేమం కోసం, పంటలను సస్యశ్యామలం చేసే అపూర్వ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2 వేల 400 కోట్ల రూపాయలతో వైయస్సార్ జలకళ పథకాన్ని సీఎం జగన్ నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. మూడు లక్షల మంది రైతులకు ఉచితంగా ప్రభుత్వం వ్యవసాయ బోర్లను వేయనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోర్లను తవ్విస్తామని, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా లోడ్ తెలుసుకునేందుకు మీటర్లు బిగిస్తామని, రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సన్నకారు రైతులకు బోర్ వేయించడంతో పాటు మోటార్లు బిగిస్తామని, ఫీడర్ల కోసం 1700 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఒకసారి బోర్ ఫెయిల్ అయితే మరొకసారి కూడా వేస్తామని దీనిపై రైతులు ఎటువంటి ఖర్చు చేయనవసరం లేదని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా రైతులకు 13500 రూపాయలు రైతు భరోసా పథకం రైతు ఖాతాలో జమ చేస్తున్నామని, గత ప్రభుత్వం 9 వందల 60 కోట్ల రూపాయల ధాన్యానికి సంబంధించిన బకాయిలు పెండింగ్ లో పెడితే రైతులు ఇబ్బందులు పడకూడదని ఆ బకాయిలు వైయస్సార్ ప్రభుత్వం చెల్లింపులు చేసిందని ఆయన తెలిపారు.
ధాన్యం విత్తనాలకు సంబంధించి 3 వేల 84 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం చెల్లించకుండా పోతే ఈ ప్రభుత్వమే కట్టిందని, రాబోయే సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలోనూ జనతా బజార్ తీసుకొస్తామని రైతులకు ఇచ్చిన మరో హామీకి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు.
