Loka Chapter 1 OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘లోక చాప్టర్ 1 చంద్ర’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Loka Chapter 1 OTT: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించిన సంచలన చిత్రం ‘లోక చాప్టర్ 1 చంద్ర’ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఆగస్ట్ 28న థియేటర్లలో విడుదలై, కేవలం మలయాళంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
చంద్ర, డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో హారర్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. షౌబీన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిశారు. వీఎఫ్ఎక్స్ మరియు డీటీఎస్ వంటి అత్యాధునిక సాంకేతికతకు భారీగా ఖర్చు చేయడంతో, నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమా బడ్జెట్ దాదాపు రూ. 65 కోట్లు అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ. 100 కోట్ల గ్రాస్ అవసరమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, ‘లోక చాప్టర్ 1 చంద్ర’ ఈ అంచనాలను మించిపోయి, సంచలనం సృష్టించింది. దేశీయంగా ఈ సినిమా రూ. 154.8 కోట్లు నెట్, రూ. 181.3 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విదేశీ మార్కెట్లైన నార్త్ అమెరికా, యూఏఈ, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కలిపి ఏకంగా రూ. 119.3 కోట్లు వసూలు చేసి, మలయాళ చిత్రాలలో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 302 కోట్ల గ్రాస్ వసూలు చేసి, భారీ వాణిజ్య విజయాన్ని నమోదు చేసింది.
సినిమా విడుదలై 50 రోజులు దాటిన నేపథ్యంలో, ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ఈ చిత్రం డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్లాక్‌బస్టర్‌ను దీపావళి కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
