150Cr Ad Film: రూ.150 కోట్లతో అత్యంత ఖరీదైన యాడ్ ఫిల్మ్.. అట్లీ దర్శకత్వం
150Cr Ad Film: భారతీయ అడ్వర్టైజింగ్ రంగంలో ఇప్పటివరకు ఎరుగని అతి భారీ బడ్జెట్‌తో ఒక కమర్షియల్ యాడ్ ఫిల్మ్ రూపొందుతోంది. సాధారణంగా అగ్రశ్రేణి బహుళజాతి సంస్థలు తీసే యాడ్స్ బడ్జెట్ కూడా రూ. 20-30 కోట్ల మధ్యే ఉంటుంది. కానీ, ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక యాడ్ ఫిల్మ్‌కు ఏకంగా రూ. 150 కోట్లు కేటాయించడం సినీ, వాణిజ్య వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ మొత్తం ఒక స్టార్ హీరో పూర్తి సినిమా బడ్జెట్‌కు సమానం కావడం విశేషం.
ప్రసిద్ధ ‘చింగ్స్ దేశీ చైనీస్’ (Ching’s Desi Chinese) అనే ప్రాసెస్డ్ ఫుడ్ తయారీ సంస్థ, భారతదేశంలో తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఇంతటి భారీ బడ్జెట్‌తో యాడ్ ఫిల్మ్ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించే బాధ్యతను ‘జవాన్’ ఫేమ్ అట్లీకి అప్పగించారు. షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ వంటి అఖండ విజయాన్ని సాధించడంతో అట్లీకి బాలీవుడ్‌లో తిరుగులేని గుర్తింపు లభించింది. ఆ క్రేజ్ నేపథ్యంలోనే ఈ చైనీస్ ఫుడ్ కంపెనీ అట్లీకి ఇంత భారీ ప్రాజెక్ట్‌ను అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ భారీ యాడ్ ఫిల్మ్‌లో బాలీవుడ్ అగ్ర నటులు రణ్‌వీర్ సింగ్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరికి జోడీగా తెలుగు గ్లామర్ క్వీన్ శ్రీలీల నటిస్తుండడం విశేషం. అట్లీ తన సినిమాల్లో అనుసరించే భారీ సెట్టింగ్‌లు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ (VFX), వైవిధ్యమైన లొకేషన్లతో ఈ యాడ్‌లను కేవలం ప్రకటనలుగా కాకుండా, ఒక సినిమాటిక్ అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నారట.
రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఫిల్మ్, దేశంలో ఇప్పటివరకు తెరకెక్కిన యాడ్స్‌లో కెల్లా అత్యంత ఖరీదైనదిగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ భారీ ఖర్చు, తారల ఎంపిక, అట్లీ దర్శకత్వం వంటి అంశాలు ఈ యాడ్ ఫిల్మ్‌కు సినిమా స్థాయి క్రేజ్‌ను తీసుకువచ్చాయి.
