Vishal On Awards: “నాకు అవార్డు ఇస్తే చెత్తబుట్టలో పడేస్తాను”.. విశాల్ సంచలన వ్యాఖ్యలు
Vishal On Awards: తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి ఫాలోయింగ్ కలిగిన యాక్షన్ హీరో విశాల్ (Vishal). ‘ప్రేమ చదరంగం’తో హీరోగా పరిచయమై, ‘పందెం కోడి’ వంటి చిత్రాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. గత కొంతకాలంగా వరుసగా మూస పాత్రలు చేయడం వల్ల హిట్‌కు దూరమైనప్పటికీ, 12 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ‘మదగజరాజా’ విజయం పునరాగమనాన్ని ఇచ్చింది. సినిమాలతో పాటు, తన ముక్కుసూటి మనస్తత్వంతోనూ విశాల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎలాంటి అంశం గురించైనా నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడే ఆయన, తాజాగా అవార్డుల ప్రక్రియపై చేసిన బోల్డ్ కామెంట్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించిన విశాల్, తన సొంత పోడ్‌కాస్ట్ “యువర్స్ ఫ్రాంక్లీ విశాల్”లో అవార్డుల ఎంపిక విధానం గురించి తీవ్ర విమర్శలు చేశారు. “అవార్డులు కేవలం కొంతమంది ఇష్టానికి అనుగుణంగా ఇస్తారు. కేవలం ఎనిమిది మంది సభ్యులు కూర్చుని, ఎనిమిది కోట్ల మంది ప్రేక్షకుల అభిప్రాయాన్ని, ఆదరణను తేల్చలేరు. అలాంటి అవార్డులకు నా దృష్టిలో ఏమాత్రం విలువ లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
అవార్డులు అంటే తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని వెల్లడించిన ఆయన.. తన నిజాయితీని చాటుకున్నారు. “ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు అవార్డు ఇస్తే, నేను దాన్ని నేరుగా చెత్తబుట్టలో పడేస్తాను” అంటూ విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవార్డుల వెనుక ఉండే పారదర్శకత లేమి, వ్యక్తిగత ప్రాధాన్యతలను ఉద్దేశించే విశాల్ ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. ఆయన నిజాయితీని, ధైర్యాన్ని అభిమానులు మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. విశాల్ చేసిన ఈ వ్యామెంట్స్‌తో సినీ వర్గాల్లో మరోసారి అవార్డుల ఎంపిక ప్రక్రియపై చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విశాల్.. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలు, సినీ పరిశ్రమలోని విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు.
