Dude Success Meet: ‘మీరు హీరో మెటీరియల్’.. ‘డ్యూడ్’ హీరో ప్రదీప్ రంగనాథన్‌కు భారీ మద్దతు!
Dude Success Meet: కోలీవుడ్ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవల ఓ సినీ ఈవెంట్లో ఎదుర్కొన్న అనుచిత ప్రశ్నకు సంబంధించిన వివాదం ఇంకా సద్దుమణగక ముందే, ఆయనకు అభిమానుల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. ఇటీవల జరిగిన ‘డ్యూడ్’ సినిమా సక్సెస్ మీట్లో, తెలుగు ప్రేక్షకుల తరపున ఒక అభిమాని ప్రదీప్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొద్ది రోజుల క్రితం ‘డ్యూడ్’ ప్రమోషన్స్ సందర్భంగా జరిగిన ఈవెంట్లో, ఒక తెలుగు లేడీ ఫిలిం జర్నలిస్ట్ ప్రదీప్‌ను నేరుగా ఉద్దేశిస్తూ.. “మీరు హీరో మెటీరియలా? మీరు హీరోలా కనిపించరు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రశ్నకు ప్రదీప్ ఆశ్చర్యానికి గురై సమాధానం ఇస్తుండగా, పక్కనే ఉన్న సీనియర్ నటుడు శరత్ కుమార్ మైక్ తీసుకుని సదరు జర్నలిస్ట్‌కు గట్టిగా బదులిచ్చారు. “ఎవరిని హీరో అని మీరు జడ్జ్ చేయకూడదు. ఇక్కడ ఉన్నవారందరూ వారికి వారే హీరోలు. సమాజానికి మంచి చేసే వ్యక్తి ఎవరైనా హీరోనే” అని శరత్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో క్లిప్ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రదీప్‌కు మద్దతు తెలుపుతూ జర్నలిస్ట్ తీరును తప్పుబట్టారు.
తాజాగా ‘డ్యూడ్’ సినిమా విజయవంతం కావడంతో నిర్వహించిన సక్సెస్ మీట్లో, ప్రదీప్ రంగనాథన్‌కు తెలుగు అభిమానుల నుంచి ఊహించని మద్దతు లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక తెలుగు అభిమాని, ప్రదీప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మా తెలుగు ప్రేక్షకుల తరపున మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ‘మీరు హీరో మెటీరియల్’. మిమ్మల్ని మేము లవ్ చేస్తున్నాం. అలాగే మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం” అని అన్నారు. ఈ మాటలకు ప్రదీప్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సంఘటనతో విమర్శలకు అభిమానుల మద్దతు రూపంలో సరైన సమాధానం లభించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
