Prabhas Fauzi: ప్రభాస్ కొత్త సినిమా టైటిలిదే.. అందరూ ఊహించిందే..
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్రబృందం ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను అందించింది. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా టైటిల్‌ను నేడు అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
చిత్రబృందం ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ‘ఫౌజీ’ టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా వారు పంచుకున్న ట్యాగ్‌లైన్ సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచుతోంది. “పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడిలాంటివాడు.. గురువు లేని ఏకలవ్యుడి ధైర్యం అతడి సొంతం.. పుట్టుకతోనే అతడు ఓ యోధుడు.. మన చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది. అతడే ‘ఫౌజీ’” అంటూ చిత్ర కథానాయకుడి పాత్ర గురించి వివరించారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఈ చిత్రంలో ఒక చారిత్రక లేదా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సైనికుడి పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
‘ఫౌజీ’ చిత్రం ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇమాన్వీ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ‘సీతారామం’ వంటి క్లాసిక్ ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించిన హను రాఘవపూడి, ఈసారి పూర్తి భిన్నమైన కథాంశంతో వస్తున్నారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో హను రాఘవపూడి మాట్లాడుతూ.. “మీరు ఇంతవరకు చూడని అద్భుతమైన కథను ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. ఇందులో ప్రభాస్ ఉన్నారు కాబట్టి, అభిమానుల అంచనాలను ఈ సినిమా తప్పక అందుకుంటుంది. ఇది ప్రేక్షకులను మునుపెన్నడూ చూడని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ‘సీతారామం’ తర్వాత ఈ స్క్రిప్ట్‌ను పూర్తి చేయడానికి నాకు ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు” అని చెప్పుకొచ్చారు. ఈ భారీ ప్రాజెక్టుపై ప్రభాస్ అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
