Chhawa Director: ఛావా డైరెక్టర్ కొత్త బయోపిక్.. ప్రసవించిన వెంటనే స్టేజ్ ఎక్కిన వితాబాయి పాత్రలో శ్రద్ధా కపూర్
Chhawa Director: ‘ఛావా’ వంటి సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఆయన దృష్టి మహారాష్ట్రకు చెందిన దిగ్గజ జానపద నర్తకి వితాబాయి భౌ మాంగ్ నారాయణంగావ్కర్ జీవితంపై పడింది. లక్ష్మణ్ ఉటేకర్ ఆమె అసాధారణ జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. అత్యంత కీలకమైన వితాబాయి పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘స్త్రీ 2’తో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న శ్రద్ధా కపూర్, ప్రస్తుతం ఈ బయోపిక్ కోసం అవసరమైన నృత్యం, సంగీతం, బయోపిక్ నేపథ్యానికి సంబంధించిన వర్క్‌షాప్‌లలో పాల్గొంటున్నట్లు సమాచారం.
సంకల్పానికి నిదర్శనం.. గర్భం, ప్రదర్శన
పురుషాధిక్య సమాజంలో వితాబాయి ఎదుర్కొన్న కష్టాలు, కళ పట్ల ఆమెకున్న అంకితభావం, అపారమైన గౌరవం ఈ సినిమాకు ప్రధాన కథాంశాలుగా నిలవనున్నాయి. వితాబాయి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆమె సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది, ఇది సినిమాలో అత్యంత ఆకట్టుకునే అంశం కానుంది. గర్భంతో ఉన్న ఆమె ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే స్టేజ్ వెనుక బిడ్డను ప్రసవించి, కొద్దిసేపటికే మళ్లీ ప్రదర్శన కొనసాగించడం వితాబాయి కళ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ సంఘటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మాట్లాడుతూ, “వితాబాయి గొప్పతనం, ఆమెకు కళ పట్ల ఉన్న గౌరవం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఆమె జీవిత గాథను తప్పనిసరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. విమర్శలు, వివాదాలు, సంక్లిష్టతలు ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రేక్షకులకు అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. షూటింగ్ వచ్చే ఏడాదిలో మొదలుపెట్టి, ‘ఛావా’ రేంజ్‌లోనే ఈ సినిమాను తెరకెక్కించి, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
