Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’: రిషబ్ శెట్టి సృష్టించిన అద్భుతం రూ.818 కోట్ల వసూళ్లు
Kantara Chapter 1: కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి యావత్ భారత దేశాన్ని మెప్పించిన తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రాంతీయ చిత్రం ఇంతటి ప్రభావాన్ని చూపడం ఇదే మొదటిసారి. తాజాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది.
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం, ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటివరకు అక్షరాలా రూ. 818 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ భారీ వసూళ్లతో, ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘కాంతార చాప్టర్ 1’ అగ్రస్థానంలో నిలబడింది. ఇది కేవలం చిత్ర బృందానికే కాక, యావత్ కన్నడ చిత్రసీమకు గర్వకారణం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇక్కడ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, డబ్బింగ్ చిత్రాల్లో ఈ ఫీట్ సాధించిన రెండో సినిమాగా రికార్డు నెలకొల్పింది.
‘కాంతార చాప్టర్ 1’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి వస్తున్న ప్రశంసలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు రిషబ్ శెట్టి విజయాన్ని కొనియాడగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తన అధికారిక సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పోస్ట్ చేస్తూ, ఈ చిత్రాన్ని ‘వన్ మ్యాన్ షో’గా అభివర్ణించారు.
“‘కాంతార’ సినిమా చూసి అవాక్కయ్యాను. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టి గారు అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ప్రతి ఒక్కరూ పాత్రల్లో జీవించారు. సాంకేతిక నిపుణుల పనితీరు కూడా చాలా గొప్పగా ఉంది. ఇంతటి అద్భుతమైన సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థకు నా అభినందనలు” అని అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వెంటనే రిషబ్ శెట్టి బన్నికి ధన్యవాదాలు తెలియజేశారు. కంటెంట్ బలంగా ఉంటే భాషా భేదం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. భారతీయ సినీ చరిత్రలో ‘కాంతార చాప్టర్ 1’ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో, త్వరలో రాబోతున్న ‘కాంతార 2’పై అంచనాలు భారీగా పెరిగాయి.
