Sharwanand: సిక్స్‌ప్యాక్‌తో శర్వానంద్.. ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఫొటోలు వైరల్
Sharwanand: విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకునే హీరోగా శర్వానంద్ పేరు పొందారు. ఇప్పుడు ఆయన పూర్తి భిన్నమైన పాత్రలో ఊహించని రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అభినయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో పాత్ర కోసం తనను తాను మార్చుకోవడంలోనూ శర్వానంద్ ఏమాత్రం వెనుకాడరని తాజా పరిణామం రుజువు చేసింది.
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం శర్వానంద్ చేసిన శారీరక మార్పులు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీపావళి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో టైటిల్‌కు తగ్గట్లే.. బైక్‌తో రేస్ ట్రాక్‌పై దూసుకెళ్తున్న బైకర్‌గా కనిపించిన శర్వానంద్, తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ‘షర్ట్‌లెస్’ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆ ఫోటోల్లో శర్వానంద్ ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత సన్నగా, కండలు తిరిగిన శరీరంతో దర్శనమిచ్చారు. నిజమైన రేసర్‌గా కనిపించడం కోసం కొన్ని నెలల పాటు కఠినమైన వర్కవుట్స్‌తో పాటు అత్యంత కఠినమైన ఆహార నియమాలు పాటించి ఆయన బరువు తగ్గినట్లు తెలుస్తోంది. సినిమా కోసం ఆయన పడిన ఈ శ్రమను చూసి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ చిత్రం 1990లు, 2000ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ‘బైకర్’ కథలో రేసింగ్, యువకుల కలలు, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. శర్వానంద్‌కి జోడీగా మాళవిక నాయర్ నటిస్తోంది. బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బైక్ రేసింగ్, స్టంట్స్ వంటి హాలీవుడ్ తరహా అంశాలతో పాటు, శర్వానంద్ తనదైన ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయనున్నారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
