Rashmika Mandanna: పాపం వారెంత బాధపడి ఉంటారో.. కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక ఎమోషనల్
Rashmika Mandanna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ దేశాన్ని కదిలించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వలన ఈ ఘోరం జరిగింది. సుమారు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా, అగ్నికీలల్లో చిక్కుకుని 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉండగా, కొందరు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగారు. చంద్రాయన్‌పల్లికి చెందిన కడారి అశోక్ (27) అనే యువకుడు అప్రమత్తమై, బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు దూకడం ద్వారా తన ప్రాణాలను కాపాడుకున్నారు. మరో ప్రయాణికుడు తరుణ్, పని కారణంగా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి-కుమార్తె మృతి చెందడం, మరొక కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోవడం వంటి హృదయ విదారక సంఘటనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
ఈ ఘోర ప్రమాదంపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “కర్నూలు బస్సు ప్రమాద వార్తతో ఉలిక్కిపడ్డాను, చాలా బాధపడ్డాను. మండుతున్న బస్సులో ప్రయాణికులు ఎంతటి బాధను అనుభవించారో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. చిన్నారులతో సహా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో చనిపోయిందని తెలిసి విచారం కలిగింది” అని ఆమె పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వీరితో పాటు, నటుడు సోనూసూద్, కిరణ్ అబ్బవరం వంటి తారలు కూడా ఈ దుర్ఘటనపై ఎమోషనల్‌గా స్పందించారు. “బస్సు ప్రమాదాల కారణంగా ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా కఠిన నిబంధనలు అమలు చేయండి” అని సోనూసూద్ తన ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రమాదం రోడ్డు భద్రతా ప్రమాణాల ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.
