Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి సందడి షురూ..
Rahul Sipligunj: ప్రైవేట్ పాటలు, ప్లేబ్యాక్ సింగింగ్‌తో యూత్‌లో సెన్సేషన్‌గా మారిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవలే హరిణ్య అనే యువతితో రాహుల్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నిశ్చితార్థం తర్వాత ఇప్పుడు రాహుల్, హరిణ్య వివాహ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. హరిణ్య తన సోషల్ మీడియా ఖాతాలో తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఈ పిక్స్‌లో రాహుల్, హరిణ్యకి ముద్దు పెడుతూ, జడ లాగుతూ, సరదాగా పసుపు దంచుతూ కనిపించారు. తమ వివాహానికి సంబంధించిన ‘లగ్న పత్రిక కార్యక్రమం’ పూర్తయినట్లు హరిణ్య ఈ ఫోటోల ద్వారా తెలియజేశారు. ఈ హుషారైన ఫోటోలను చూసి అభిమానులు, నెటిజన్లు రాబోయే పెళ్లి వేడుకల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం.
రాహుల్ సిప్లిగంజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే, మాస్ బీట్‌లకు ఆయన వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని “నాటు నాటు” పాటతో రాహుల్‌కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆ పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆస్కార్ వేదికపై పాట పాడి దేశానికి గర్వకారణంగా నిలిచిన రాహుల్‌ను, 2023లో రేవంత్ రెడ్డి సన్మానించారు.
అనంతరం ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మాట నిలబెట్టుకుని, రాహుల్‌కు ఒక కోటి రూపాయల ప్రోత్సాహక చెక్కును కూడా అందించారు. ‘గల్లీ కా గణేష్’ వంటి పాటలతో తెలంగాణ సొగసును, భాషా స్వరూపాన్ని తన పాటల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసిన రాహుల్ సిప్లిగంజ్, సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
