Super She Movie: గుప్పెడంత మనసు జగతి మేడమ్ లీడ్ రోల్‌లో కొత్త సినిమా..
Super She Movie: యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త చిత్రం ‘కిల్లర్’. విభిన్నమైన కథాంశంతో, హై-టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, స్వయంగా దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు.
‘కిల్లర్’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే దశలో ఉంది. ఈ సినిమా విడుదల గురించి దర్శకురాలు జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ, ఇది భారతదేశంలోనే రూపొందుతున్న మొట్టమొదటి ‘సూపర్ షీ మూవీ’ అని వెల్లడించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్ కలగలిపి, ఆద్యంతం ఉత్కంఠభరితమైన అనుభూతిని అందిస్తుందని ఆయన తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని పూర్వాజ్ పేర్కొన్నారు.
‘కిల్లర్’ ప్రచార చిత్రాలు, గ్లింప్స్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఈ వీడియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ చిత్రాన్ని జ్యోతి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఏ. పద్మనాభరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ హైబ్రిడ్ జానర్ చిత్రాన్ని థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్‌ఆర్, ఏయూ అండ్ ఐ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఉర్వీష్ పూర్వాజ్ సమర్పిస్తున్న ఈ సినిమాకు జగదీశ్ బొమ్మిశెట్టి కెమెరామెన్‌గా, ఆశీర్వాద్, సుమన్ జీవ సంగీత దర్శకులుగా వ్యవహరించారు. విశాల్ రాజ్, దశరథ్, చందు, గౌతమ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
