Balakrishna: ‘అఖండ 2’ తర్వాత హిస్టారికల్ మూవీలో బాలయ్య.. గోపీచంద్ మలినేనితో చారిత్రక చిత్రం
Balakrishna: నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో ఉత్సాహభరితమైన వార్త. ‘అఖండ 2’ వంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ తర్వాత బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాతో బాలయ్య మాస్ ఇమేజ్ను గోపీచంద్ సరికొత్త స్థాయిలో చూపించి, బోయపాటి శ్రీను తర్వాత ఆ స్థానంలో నిలిచారు.
ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయబోతున్న ‘ఎన్బీకే 111’ చిత్రం హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందనుందని టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. కథా నిర్మాణం, సెట్ డిజైన్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. బాలకృష్ణ ఈ సినిమాలో శక్తివంతమైన మహారాజు పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చారిత్రక కథలో మహారాజుకు సరైన జోడీగా నయనతారను ఎంపిక చేసినట్లు సమాచారం. బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. వీరిద్దరూ కలిసి నటించిన ‘సింహా’, ‘జై సింహా’, ‘శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలు విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ మళ్లీ ఒక చారిత్రక చిత్రంలో రాణి-మహారాజు పాత్రల్లో కనిపించబోతుండడం ఆసక్తిని పెంచుతోంది.
బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ విడుదలకు సిద్ధమవుతుండగా, ఆ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అదే సమయంలో బాలయ్య తన క్లాసిక్ చిత్రం ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ఆదిత్య 999’ ప్రాజెక్ట్‌పై కూడా దృష్టి సారించారు. నయనతార కూడా ప్రస్తుతం చిరంజీవితో కలిసి ‘మన శంకరవరప్రసాద్’ సినిమాలో నటిస్తోంది. మొత్తం మీద బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబో ఈసారి మాస్ జానర్‌కు భిన్నంగా చారిత్రక సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
