Firestorm Video Song: పవన్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్.. ‘ఫైర్ స్ట్రోమ్’ వీడియో సాంగ్ రిలీజ్
Firestorm Video Song: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది. థియేటర్లలో ఘన విజయం సాధించి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజీ’లోని ‘ఫస్ట్ బ్లాస్ట్’ పాట ‘ఫైర్ స్ట్రోమ్’ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్ కల్యాణ్ మాస్ గ్యాంగ్‌స్టర్ లుక్, ఎస్.ఎస్. తమన్ అందించిన హై ఎనర్జీ బీట్స్, ఆకట్టుకునే విజువల్స్ పవన్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. గతంలో లిరికల్ వీడియో విడుదలైనప్పుడు, ‘ఫైర్ స్ట్రోమ్’ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోల్లో రెండో స్థానంలో నిలిచి, “అన్‌స్టాపబుల్ స్టార్మ్” అంటూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు విడుదలైన పూర్తి వీడియో సాంగ్‌కు కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది.
‘ఫైర్ స్ట్రోమ్’ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడానికి ముఖ్య కారణం దాని సంగీతం, విభిన్నమైన గాత్రాలు. కోలీవుడ్ స్టార్ శింబుతో పాటు ఎస్.ఎస్. తమన్, నజీరుద్దీన్, భరద్వాజ్, దీపక్ బ్లూ ఈ పాటకి పవర్‌ఫుల్ వాయిస్ ఇచ్చారు. పాటలో “అలలిక కదలక భయపడెలే… ప్రళయం ఎదురుగా నిలబడెలే… ఓజెస్ గంభీర…” వంటి లైన్స్ మాస్ ఆడియన్స్‌కు పిచ్చి ఎక్కించాయి.
ఈ పాట బహుళ భాషల్లో రూపొందడం మరో విశేషం. తెలుగు సాహిత్యాన్ని విశ్వ, శ్రీనివాస్ అందించగా, ఆంగ్ల (English) లిరిక్స్‌ను రాజకుమారి, జపనీస్ లిరిక్స్‌ను అద్వితీయ వొజ్జాల రాశారు. ఈ వైవిధ్యభరితమైన సంగీత కూర్పు సినిమా థీమ్ మరియు పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్ర తీవ్రతను అద్భుతంగా ఎలివేట్ చేసింది.
‘సాహో’ ఫేం సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌ను డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సమురాయ్ స్టైల్ వారియర్‌గా కనిపించి, తన స్టైల్, యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించారు. పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తన నట విశ్వరూపం చూపారు. ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి కీలక పాత్రల్లో నటించి సినిమాకు బలం చేకూర్చారు.
థియేటర్లలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ‘ఓజీ’ చిత్రం, ప్రస్తుతం ఓటీటీలో కూడా విశేష స్పందన దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో, ‘ఫైర్ స్ట్రోమ్’ పూర్తి వీడియో సాంగ్ విడుదల కావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
