Surekha Vani Supritha: మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన తల్లి, కూతురు సురేఖ వాణి-సుప్రీత
Surekha Vani Supritha: ప్రస్తుత రోజుల్లో సినీ ప్రముఖులు తమ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ కోవలో, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సురేఖ వాణి కూడా తన రోజువారీ విశేషాలను తరచూ అభిమానులకు తెలియజేస్తుంటారు. తాజాగా సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతతో కలిసి అత్యంత భక్తిశ్రద్ధలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
అయితే ఈ దర్శనం కోసం వారు నడక దారిలో మోకాళ్ళ పర్వతంపై మోకాళ్ళపై మెట్లు ఎక్కి తమ మొక్కును చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల తల్లి-కూతురు కలిసి దిగిన ఫొటోలను సురేఖ వాణి, సుప్రీత తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వారి భక్తిని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లి పాత్రల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన సురేఖ వాణి, ఈ మధ్యకాలంలో వెండితెరపై ఎక్కువగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటున్నారు. ఆమె తరచూ తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో పాటు, కుమార్తె సుప్రీతతో కలిసి చేసే సరదా వీడియోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు.
ఇటీవల సురేఖ వాణి, సుప్రీత కలిసి దిగిన మరికొన్ని గ్లామరస్ ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలలో సురేఖ వాణి తన కూతురు అందానికి ఏ మాత్రం తీసిపోకుండా, మరింత మెరుపుతో కనిపించడం విశేషం. తల్లి – కూతురు ఇద్దరూ పోటీపడేలా పోజులు ఇవ్వడంతో, నెటిజన్లు ఆ ఫొటోలపై ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. సురేఖ వాణి వయస్సు పెరిగినా అందం మరింత పెరుగుతోందని కొందరు అంటుండగా, ఇద్దరూ ఒకరిని మించి మరొకరు అందంగా ఉన్నారని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
సురేఖ వాణి వ్యక్తిగత జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. ఆమె భర్త, దర్శకుడు సురేష్ తేజ 2019 మే 6న ఆకస్మికంగా కన్నుమూయడంతో, సురేఖ వాణి తీవ్రంగా మానసిక వేదనకు గురయ్యారు. భర్త లేకపోవడంతో ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. అయితే, ఈ పుకార్లను సురేఖ వాణి, సుప్రీత ఇద్దరూ ఖండించి, తమ జీవితం గురించి వచ్చిన అవాస్తవ వార్తలకు చెక్ పెట్టారు.
