Prabhas Fauji: ప్రభాస్ సెట్‌లో నవ్వులు పూయించిన రాహుల్ రవీంద్రన్.. ‘ఫౌజీ’ సెట్‌లో సారీ చెప్పిన రెబల్ స్టార్
Prabhas Fauji: ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్, తన భారీ చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్‌లో జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
‘ఫౌజీ’ సినిమాలో రాహుల్ రవీంద్రన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తన పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో వయసు మళ్లిన వ్యక్తిలా కనిపిస్తున్న రాహుల్‌ను, సెట్‌లో చాలామంది గుర్తించలేకపోతున్నారట.
ఈ నేపథ్యంలో ఒక రోజు షూటింగ్ విరామ సమయంలో రాహుల్, ప్రభాస్ ఎదురుపడ్డారు. రాహుల్ ప్రభాస్‌కు ‘నమస్తే’ అని పలకరించగా, ప్రభాస్ కూడా నవ్వుతూ ‘హలో’ అని సమాధానం ఇచ్చారు. అయితే రాహుల్‌ను ఎక్కడో చూసినట్లు అనిపించడంతో, ప్రభాస్ వెంటనే దర్శకుడు హను రాఘవపూడి వద్దకు వెళ్లి ఆ యాక్టర్ ఎవరు అని ఆరా తీశారట. అప్పుడు హను రాఘవపూడి.. “అతను రాహుల్ రవీంద్రన్, నా మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ హీరో” అని చెప్పడంతో ప్రభాస్ ఆశ్చర్యపోయారట.
వెంటనే నవ్వుతూ రాహుల్ రవీంద్రన్ వద్దకు వచ్చిన ప్రభాస్, పదిసార్లకు పైగా ‘సారీ’ చెప్పి, “నిజంగా గుర్తు పట్టలేకపోయాను” అని అన్నారు. ఆ తర్వాత వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారని రాహుల్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్, ప్రభాస్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. “ప్రభాస్ చాలా ఫ్రెండ్లీ పర్సన్, ఆయనలో కొంచెం కూడా గర్వం లేదు. చాలా మంచి హ్యూమన్ బీయింగ్” అని ప్రశంసించారు. బయట సైలెంట్‌గా కనిపించినా, సెట్‌లో మాత్రం అందరితో జోకులు వేస్తూ, నవ్వుతూ పలకరిస్తూ చాలా సరదాగా ఉంటారని ఆయన చెప్పారు.
ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’తో పాటు, ‘కల్కి 2898 AD’ సీక్వెల్, ‘రాజాసాబ్’ మరియు మరికొన్ని భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్టార్‌డమ్ ఎంత ఉన్నా ప్రభాస్ చూపించే అంకితభావం, వినయం ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ‘ఫౌజీ’ చిత్రం యాక్షన్, ఎమోషన్ కలగలిపిన విభిన్న కథాంశంతో వస్తున్నట్లు సమాచారం. ఈ సరదా సంఘటన, ప్రభాస్ వినయం ఎంత గొప్పదో మరోసారి రుజువు చేసింది.
