Sharukh Khan: షారూఖ్ ఖాన్ షష్టిపూర్తి వేడుకలు.. టాలీవుడ్లో ఎవరికి ఇన్విటేషన్ అందిందంటే?
Sharukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నవంబర్ 2న తన 60వ పుట్టినరోజును (షష్ఠిపూర్తి) అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు. ఈసారి ఆయన తన అభిమానులను ఆశ్చర్యపరిచేలా తమ సంప్రదాయ వేడుకలను మార్చారు. సాధారణంగా ముంబైలోని తన ఇంద్రభవనం ‘మన్నత్’ ముందు వేల మంది అభిమానుల మధ్య షారుఖ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం ‘మన్నత్’ భవనంలో పునరుద్ధరణ, విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా, వేడుకలను అలీబాగ్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌కు మార్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ భారీ ప్రైవేట్ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, కుటుంబ సభ్యులతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ముఖ్యులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నవంబర్ 1 నుంచే అతిథులు అలీబాగ్‌కు చేరుకోనున్నారు. బాలీవుడ్ అగ్ర తారలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌తో పాటు భారతీయ పారిశ్రామిక ప్రముఖులు అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
ముఖ్యంగా, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి పలువురు సినీ ప్రముఖులకు సైతం ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ కలయిక షారుఖ్ పుట్టినరోజును కేవలం బాలీవుడ్‌కే కాకుండా, సౌత్ సినీ ఇండస్ట్రీకి కూడా ఒక ప్రత్యేక సందర్భాన్ని మార్చనుంది.
షష్ఠిపూర్తి సందర్భంగా అభిమానుల కోసం షారుఖ్ ఖాన్ ఒక బహుమతిని సిద్ధం చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న తన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’ యొక్క ఫస్ట్ లుక్ నవంబర్ 2న విడుదల కానుంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై హింట్ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో పాటు అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ, దీపికా పదుకొనే, కుమార్తె సుహానా ఖాన్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, అభయ్ వర్మ, జైదీప్ అహ్లవత్, రాఘవ్ జుయల్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 2026లో గాంధీ జయంతి వారాంతంలో విడుదలయ్యే అవకాశం ఉంది. గత కొంత కాలంగా షారుఖ్ ఖాన్ నుంచి భారీ బ్లాక్బస్టర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ కొత్త సినిమా ప్రకటన ఖచ్చితంగా కిక్ ఇస్తుందని చెప్పొచ్చు.
