Nara Rohith: ఘనంగా జరిగిన నారా రోహిత్ – నటి శిరీష వివాహం.. ఫొటోలు చూశారా?
Nara Rohith: టాలీవుడ్ యువ నటుడు నారా రోహిత్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన తన ప్రేయసి, నటి శిరీషను వివాహం చేసుకున్నారు. గురువారం (అక్టోబర్ 30) రాత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. నారా లోకేష్ సహా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
నారా రోహిత్ దివంగత రామ్మూర్తి నాయుడు కుమారుడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి, సినిమాలపై ఉన్న మక్కువతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందారు. 2009లో ‘బాణం’ చిత్రంతో హీరోగా పరిచయమై, ఆ తర్వాత ‘సోలో’, ‘అసుర’, ‘రౌడీ ఫెలో’, ‘జో అచ్యుతానంద’ వంటి విభిన్న కథాంశాలున్న చిత్రాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ఆయన చిత్రాలు ‘భైరవం’, ‘సుందరకాండ’ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన నటనతో పాటు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.
నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి 2’ సినిమాలో శిరీష హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాదే నిశ్చితార్థం జరిగింది. అయితే, రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణం కారణంగా వివాహం కొంతకాలం వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబర్ 30 రాత్రి వారిద్దరూ వివాహ బంధంతో ఏకమయ్యారు. ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు మరియు భువనేశ్వరి దంపతులు దగ్గరుండి పెళ్లి బాధ్యతలను పర్యవేక్షించారు.
వధువు శిరీష స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతల. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగం చేసినా, నటనపై ఉన్న ఆసక్తితో స్వదేశానికి వచ్చారు. హైదరాబాద్‌లో తన సోదరి వద్ద ఉంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో ‘ప్రతినిధి 2’ ఆడిషన్స్‌లో ఎంపికయ్యారు. ఆ సినిమా ద్వారానే ఆమె జీవిత భాగస్వామిని కూడా కలుసుకోవడం విశేషం. శిరీష నారా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టడం పట్ల సినీ వర్గాల్లో అభిమానులలో సంతోషం వ్యక్తమవుతోంది.
