Bheems Ceciroleo: భీమ్స్ సిసిరోలియోకు ఊహించని మెగా ఛాన్స్.. కోలీవుడ్‌లో కొత్త ప్రయాణం
Bheems Ceciroleo: తెలుగు సినీ పరిశ్రమలో సరైన అవకాశాల కోసం పన్నెండేళ్లకు పైగా ఎదురుచూసిన సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కెరీర్ ఇప్పుడు ఊపందుకుంది. ‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు, జరిగిన తరవాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు’ అనే డైలాగ్‌ను నిజం చేస్తూ, భీమ్స్ జీవితంలో ‘ధమాకా’ చిత్రంతో పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ‘బలగం’ వంటి క్లాసిక్ చిత్రంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంలో ఆయన అందించిన సంగీతం కీలక పాత్ర పోషించింది, ఇది ఆయనకు ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంతో భీమ్స్ ఇప్పుడు తెలుగులో క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారూ’ చిత్రానికి ట్యూన్స్ కట్టే బాధ్యత తీసుకున్నారు. అలాగే, అడివి శేష్ హీరోగా రాబోతున్న ‘డెకాయిట్’ చిత్రానికి కూడా ఆయన సంగీతం అందించనున్నారు.
ఇటీవల విడుదలైన ‘మాస్ జాతర’ చిత్రం భీమ్స్ కెరీర్‌లో మరో మలుపు తిప్పింది. రవితేజతో కలిసి ‘బెంగాల్ టైగర్’, ‘ధమాకా’ చిత్రాలకు పనిచేసిన భీమ్స్‌కు, ‘మాస్ జాతర’ ద్వారా మరోసారి అవకాశం దక్కింది. ఈ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ భీమ్స్ టాలెంట్‌ను గుర్తించిన సూర్య, వేదికపైనే ఆయన పనితీరును ప్రశంసించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని భీమ్స్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
ఇప్పటివరకు కేవలం తెలుగు సినిమాకే పరిమితమైన భీమ్స్‌కు ఇది ఒక అద్భుతమైన అవకాశం. అయితే, కోలీవుడ్‌లో ఇప్పటికే అనిరుధ్, సాయి అభ్యంకర్, జీవీ ప్రకాష్ వంటి అగ్ర సంగీత దర్శకులు హవా నడుస్తోంది. ఈ పోటీని తట్టుకుని భీమ్స్ కోలీవుడ్‌లో ఎంతవరకు నిలబడగలరనేది ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చగా మారింది.
