Monalisa: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మోనాలిసా.. హీరో ఎవరంటే?
Monalisa: సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతటిదో మరోసారి నిరూపించింది మోనాలిసా అనే యువతి జీవితం. మహాకుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటూ సాధారణ జీవితం గడిపిన ఈ అమ్మాయి.. ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు ఏకంగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. తేనె పట్టులాంటి కళ్లు, ముగ్ధమనోహరమైన చిరునవ్వు, అమాయకత్వంతో కూడిన హావభావాలు మోనాలిసాను రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్గా మార్చేశాయి.
మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా తన కుటుంబంతో కలిసి మహాకుంభ్ మేళాకు వచ్చినప్పుడు, పూసలు అమ్ముతుండగా కొందరు వ్యక్తులు తీసిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆమె సహజమైన అందానికి, కష్టపడే తత్వానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ ఒక్క క్షణం మోనాలిసా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
మోనాలిసా వైరల్ అయిన కొద్ది రోజులకే ఆమె ప్రతిభను గుర్తించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, తన చిత్రం “ది డైరీ ఆఫ్ మణిపూర్”లో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో ఆమె వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత తాజాగా మోనాలిసా తెలుగు సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టి, పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘లైఫ్’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
‘క్రష్’, ‘ఇట్స్ ఓకే గురు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో చరణ్ సాయి సరసన మోనాలిసా కథానాయికగా నటిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో ఈ ‘లైఫ్’ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్పై అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కుంభమేళాలో పూసలు అమ్మే స్థాయి నుంచి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మారడం వరకు మోనాలిసా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె అందం, వినయంతో పాటు కష్టపడి పైకి వచ్చిన తీరు ఇప్పుడు దేశంలోని యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
