Yami Gautam: దీపికా పదుకొణె 8 హవర్స్ వర్కింగ్‌కు యామీ గౌతమ్ సపోర్ట్.. ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’పై కొత్త చర్చ!
Yami Gautam: బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె తన సినిమా షూటింగ్‌ల సమయంలో రోజుకు కేవలం 8 గంటల పని షిఫ్ట్ మాత్రమే కావాలని డిమాండ్ చేయడం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ డిమాండ్ కారణంగానే ఆమె పలు పెద్ద ప్రాజెక్టులను వదులుకున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’ నుంచి కూడా దీపికా తప్పుకోవడానికి ఇదే ప్రధాన కారణమంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నటులు తమ పని గంటలను నియంత్రించుకోవాలనే అంశంపై ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
తాజాగా ఈ వివాదంపై నటి యామీ గౌతమ్ స్పందిస్తూ, దీపికా పదుకొణె డిమాండ్‌కు పూర్తిగా మద్దతు పలికారు. షూటింగ్లో సమయ పరిమితి అనేది నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు మధ్య ఉండే పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. “ఇతర రంగాల మాదిరిగా మన సినీ పరిశ్రమ కొంచెం భిన్నంగా ఉంటుంది. లొకేషన్ పర్మిషన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల సమన్వయం వంటి అనేక అంశాలు ఇక్కడ కీలకం. అందుకే సమయపాలన విషయంలో పక్కా నిబంధనలు పెట్టడం కష్టం” అని యామీ వివరించారు.
కొంతమంది నటీనటులు ఎన్నో ఏళ్లుగా రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తున్నారని, ఇది కొత్తగా వచ్చిన డిమాండ్ ఏమీ కాదని యామీ గౌతమ్ గుర్తు చేశారు. నటులు, నిర్మాతలు ముందే మాట్లాడుకుని ఈ పని గంటలను నిర్ణయించుకుంటారని ఆమె తెలిపారు.
“ఒక మహిళా నటి ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ గురించి అడిగితేనే అది పెద్ద వివాదంలా ఎందుకు మారుతోందో అర్థం కావడం లేదు. నటులు తమ పని గంటల గురించి డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అది షూటింగ్‌కి అనుకూలంగా ఉంటే కొనసాగవచ్చు. లేదంటే ఆ ప్రాజెక్ట్‌ను వదులుకోవచ్చు” అని యామీ బలంగా వాదించారు. బాలీవుడ్లో కొత్తగా తల్లి అయిన తర్వాత దీపికా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆమె వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశం కనిపిస్తోంది.
దీపికా డిమాండ్‌ను ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ నటీనటులు సైతం సమర్థించారు. తాజాగా యామీ గౌతమ్ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడటం ఈ చర్చకు మరింత బలం చేకూర్చినట్లైంది.
