K Ramp OTT: కిరణ్ అబ్బవరం ‘కే- ర్యాంప్’ ఓటీటీ సందడి షురూ! ఎప్పుడంటే?
K Ramp OTT: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కె- ర్యాంప్’ డిజిటల్ ప్రీమియర్‌కు రంగం సిద్ధమైంది. థియేటర్లలో మాస్ ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు ఇంట్లోనే వీక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇందులో కొన్ని ఫన్నీ సన్నివేశాలు, పాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వారి నిరీక్షణకు తెరదించుతూ, ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించింది.
‘కె- ర్యాంప్’ చిత్రం నవంబర్ 15వ తేదీ నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేటర్లలో సినిమా చూడలేని లేదా మరోసారి ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులు ఇంట్లో నుంచే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూసే అవకాశం లభించింది.
జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం ధనవంతుడి గారాల పట్టి ‘కుమార్ అబ్బవరం’ పాత్ర పోషించారు. తండ్రి (సాయికుమార్) అపారమైన ప్రేమ, గారాబంతో చదువును పక్కనపెట్టి, స్నేహితులతో సరదాగా, అల్లరిచిల్లరిగా తిరిగే పాత్రలో కుమార్ కనిపిస్తారు. కొడుకును దారిలో పెట్టాలని భావించిన తండ్రి, ఒక పండితుడి సలహా మేరకు కేరళలోని ఒక కళాశాలలో అతన్ని చేరుస్తారు. అక్కడ తన మామ (నరేశ్ వీకే) అండదండలతో కుమార్ తన పాత అలవాట్లను కొనసాగిస్తూ ఉంటాడు.
అలాంటి సందర్భంలో, అతిగా మద్యం సేవించడం వల్ల ఊపిరాడక ఇబ్బంది పడుతున్న కుమార్‌ను, మెర్సీ జాయ్ (యుక్తి తరేజా) అనే యువతి తన సమయస్ఫూర్తితో కాపాడుతుంది. ఆమె ఎవరో కాదు, అదే కళాశాలలో తన సహవిద్యార్థిని అని కుమార్ తెలుసుకుంటాడు. మొదటి చూపులోనే మెర్సీ జాయ్‌తో ప్రేమలో పడిన కుమార్, ఆమెతోనే తన జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అయితే మెర్సీ జాయ్‌ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య ఈ ప్రేమకథలో కీలక మలుపు తిప్పుతుంది. ఆ సమస్య గురించి కుమార్ ఎప్పుడు, ఎలా తెలుసుకున్నాడు? ఆ నిజాన్ని తెలుసుకున్న తర్వాత కూడా అతను మెర్సీని అంతే గాఢంగా ప్రేమించాడా? లేక ఆ సమస్య కారణంగా ఆమెకు దూరమయ్యాడా? ఒకరి జీవితంలో మరొకరి ప్రవేశం ఎలాంటి అనూహ్య మార్పులకు దారితీసింది? అనే ఆసక్తికరమైన అంశాలతో మిగతా కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సాయికుమార్, నరేశ్ వీకేలతో పాటు కామ్నా జెఠ్మలానీ తదితరులు కీలక పాత్రల్లో నటించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. ఈ ఎంటర్‌టైనర్ ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.
