SSMB 29: రాజమౌళి – మహేశ్ బాబు ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్.. ‘వారణాసి’ టైటిల్ ఫిక్సా?
SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం టైటిల్ ప్రకటన వేడుకకు రంగం సిద్ధమైంది. సినిమా టైటిల్‌తో పాటు మహేశ్ బాబు ఫస్ట్ లుక్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని కనులారా చూసేందుకు ఘట్టమనేని అభిమానులు, సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ భారీ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కనివిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. వేదిక వద్ద భారీ LED స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా సుమారు లక్ష మందికి పైగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈవెంట్‌కు సంబంధించిన ఎంట్రీ పాస్‌లకు అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
కాగా ఈ ప్రతిష్టాత్మక టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా దక్కించుకుంది. ఈ డీల్‌లో భాగంగా ఈ వేడుకను కేవలం తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేసేలా జియో సినిమా ఒప్పందం కుదుర్చుకుందట.
ఈ భారీ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి, అలాగే గ్లోబల్ స్టార్స్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, లైవ్ స్ట్రీమింగ్ హక్కులు పొందిన సంస్థ ఆదేశాల మేరకు, ఈ ఈవెంట్‌ను కవర్ చేయడానికి వచ్చే మీడియా ప్రతినిధులను అనుమతించినప్పటికీ, ఇతర మీడియా సంస్థల కెమెరాలను మాత్రం వేదిక లోపలికి అనుమతించడం లేదని తెలుస్తోంది.
మరోవైపు, మహేశ్ బాబు ఫ్యాన్స్ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌గా పిలుస్తున్న ఈ సినిమా టైటిల్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లీకైన సమాచారం ప్రకారం, రాజమౌళి ఈ సినిమాకు ‘వారణాసి’ అనే పౌరాణిక, అడ్వెంచర్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ భారీ అంచనాలు ఉన్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
