Ram Charan: ‘చికిరి చికిరి’తో చిరంజీవి ‘మీసాల పిల్ల’ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్
Ram Charan: మెగా కుటుంబం నుంచి అప్‌డేట్ వచ్చిందంటే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ సినిమాల పాటలతో అభిమానులకు డబుల్ ధమాకా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు తండ్రీకొడుకుల మధ్య నెలకొన్న అనూహ్యమైన యూట్యూబ్ రికార్డుల పోటీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట సోషల్ మీడియాలో భారీ ట్రెండ్‌ను సృష్టించింది. భీమ్స్ సిసిరోలియో అందించిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ పాట, కేవలం మూడు వారాల వ్యవధిలోనే యూట్యూబ్‌లో 50 మిలియన్ (5 కోట్లు) వీక్షణలు సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాటకు అభిమానులు, సాధారణ నెటిజన్లు చేసిన రీల్స్, షార్ట్ వీడియోలు వైరల్ కావడంతో చిరంజీవి పాట జోరు మరింత పెరిగింది.
అయితే ఇప్పుడు ఈ రికార్డును కొడుకు రామ్ చరణ్ కేవలం రెండు రోజుల్లోనే అధిగమించడం విశేషం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ చిత్రం నుంచి విడుదలైన మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ పాట అద్భుతమైన స్పందనను అందుకుంది. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట విడుదలైన 35 గంటల్లోనే అసాధారణంగా 50 మిలియన్ వీక్షణల మైలురాయిని దాటింది.
చిరంజీవి ‘మీసాల పిల్ల’ పాట కేవలం తెలుగు లిరికల్ వీడియోగా విడుదలై మూడు వారాల్లో ఈ ఘనత సాధించగా, రామ్ చరణ్ ‘చికిరి చికిరి’ పాట తెలుగుతో సహా నాలుగు భాషల్లో ఒకేసారి లిరికల్ వీడియోగా విడుదలై, కేవలం రెండు రోజుల్లోనే ఈ రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకరి తర్వాత మరొకరు రికార్డులు నెలకొల్పుతూ సోషల్ మీడియాను ఊపేస్తుండటంతో, అభిమానులు ‘మెగా మ్యూజిక్ ఫెస్టివల్’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ రెండు చిత్రాలు సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
