Avatar 3: సరికొత్త సంచలనానికి సిద్ధమవుతున్న ‘అవతార్ 3’.. రన్‌టైమ్ ఫిక్స్!
Avatar 3: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం ‘అవతార్’ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకుపోయింది. తొలి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించగా, మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ అష్’ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ‘అవతార్ 3’ నిడివికి సంబంధించిన కీలక అప్‌డేట్ విడుదలైంది. ఈ చిత్రం ఏకంగా 3 గంటల 15 నిమిషాల (195 నిమిషాలు) నిడివితో లాక్ అయినట్లు తెలుస్తోంది. మొదటి భాగం (2009) 2 గంటల 58 నిమిషాలు, రెండో భాగం (అవతార్: ది వే ఆఫ్ వాటర్) 3 గంటల 12 నిమిషాల నిడివిని కలిగి ఉన్నాయి. ఇప్పుడు మూడో భాగం వాటిని మించిపోయేలా ఎక్కువ నిడివితో రూపొందనుండటం సినిమా స్థాయిని తెలియజేస్తోంది.
2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో, పండోరా ప్రపంచానికి సరికొత్త విలన్ ‘వరాంగ్’ పాత్రను పరిచయం చేయనున్నారు. ఈ నావి పాత్రలో నటి ఊనా చాప్లిన్ కనిపించబోతుండటం ప్రత్యేక ఆకర్షణ. పండోరా ఆత్మగా భావించే ఐవా (Eywa)కు వ్యతిరేకంగా నిలబడే తొలి నావి పాత్ర ఇదే కావడంతో, కథలో ఊహించని ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది.
దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇప్పటికే మాట్లాడుతూ, ఈ మూడో భాగం మునుపటి రెండు సినిమాల కంటే మరింత ఉత్కంఠభరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుందని తెలిపారు. సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్డానా, సిగోర్నీ వీవర్, కేట్ విన్‌స్లెట్ వంటి పాత తారాగణం కొనసాగుతుండగా, ఊనా చాప్లిన్ కీలక పాత్రలో కొత్తగా జాయిన్ అవుతున్నారు.
మొత్తం ఐదు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సిరీస్‌లో, మూడో భాగం తరువాత నాలుగోది 2029లో, ఐదోది 2031లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ‘అవతార్ 3’ విడుదల సమయంలోనే, మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌ను థియేటర్లలో అటాచ్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజమైతే, అవతార్ మరియు మార్వెల్ అభిమానులకు ఇది నిజంగానే డబుల్ ట్రీట్‌గా మారనుంది.