Akhanda 2: పిల్లలకు ‘అఖండ 2’ చూపించాలి.. ఇది కేవలం సినిమా కాదు.. భారతదేశ ఆత్మ
Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాలోని భక్తి గీతాన్ని శుక్రవారం ముంబయిలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కథానాయకుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడించారు. “హిందూ సనాతన ధర్మం యొక్క శక్తి పరాక్రమాన్ని ఈ ‘అఖండ 2: తాండవం’లో ప్రతి ఒక్కరూ చూస్తారు. ఈ చిత్రాన్ని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని వెంటపెట్టుకుని తీసుకెళ్లి చూపించాలి. ఇది మన ధర్మాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది” అని బాలకృష్ణ అన్నారు. “రంగ రంగ శంభు లింగ” అంటూ సాగే ఈ శక్తివంతమైన భక్తి పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ స్వరపరచగా, కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ తమ గాత్రంతో దీనికి ప్రాణం పోశారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ బాలకృష్ణ నిబద్ధతను, ఈ ప్రాజెక్ట్ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని కొనియాడారు. “బాలకృష్ణ గారితో మాది నాలుగో సినిమా. మా గత మూడు చిత్రాలు (సింహా, లెజెండ్, అఖండ) బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘అఖండ 2’ కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది భారతదేశ ఆత్మ. మన ధర్మం. ఈ సినిమా కుటుంబమంతా కలిసి చూడదగినది. కొన్ని కీలక సన్నివేశాలను అత్యంత శీతల వాతావరణంలో చిత్రీకరించాం. మేమంతా స్వెటర్లు, జాకెట్లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటే, బాలకృష్ణ గారు మాత్రం చలిని ఏమాత్రం లెక్కచేయకుండా ఓ మామూలు పంచె కట్టుకుని ఆ పాత్రలో జీవించారు. ఇది ఆయన నటన పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం” అని బోయపాటి పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాణంలో తమ వెనుక శివయ్యే ఉండి, ఈ గొప్ప ప్రాజెక్టును పూర్తి చేయించాడని ఆయన ఉద్వేగంగా తెలిపారు.
రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో తమన్, ఆది పినిశెట్టి, కైలాష్ ఖేర్, గోపీ ఆచంట, హర్షాలి తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమవుతోంది.
