Deepika Padukone: 8 గంటలే పని చేస్తా.. నాకు ఆరోగ్యమే ముఖ్యం.. దీపికా పదుకొణె కామెంట్స్
Deepika Padukone: బాలీవుడ్ అగ్ర తార దీపికా పదుకొణె వృత్తిపరమైన నిబద్ధత, వ్యక్తిగత ఆరోగ్యం మధ్య సమతుల్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆమె తన వర్కింగ్ అవర్స్ విధానాల కారణంగా కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి వాటి నుంచి తప్పుకున్నారనే వార్తలు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ‘ఎక్కువ పని’ సంస్కృతిపై దీపికా తాజాగా గళం విప్పారు.
ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ‘ఎక్కువ పని’ చేయడాన్ని కూడా సాధారణంగా చూస్తున్నారని దీపిక అభిప్రాయపడ్డారు. నిబద్ధతను చూపడం కోసం చాలా మంది ఉద్యోగులు, కళాకారులు అనవసరంగా అధిక పనిభారాన్ని భరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ నిబద్ధత, పని గంటల మధ్య గందరగోళం చాలా మందిని ఒత్తిడికి గురి చేస్తోందని అన్నారు. ఈ చర్చకు ముగింపు పలుకుతూ, రోజుకు ఎనిమిది గంటల పని డిమాండ్ సరైనదని, ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి సరిపోతుందని ఆమె గట్టిగా సమర్థించారు.
“మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన పనిలో అత్యుత్తమ ఫలితాన్ని ఇవ్వగలం. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు మంచి ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే నా సొంత కార్యాలయంలో కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఎనిమిది గంటలు మాత్రమే పని చేసే విధానాన్ని కచ్చితంగా పాటిస్తున్నాం” అని దీపికా వెల్లడించారు.
తాను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన తల్లిపై గౌరవం మరింత పెరిగిందని దీపికా పంచుకున్నారు. పని, పిల్లల బాధ్యతలను సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చని పైకి చెప్పినా, వాస్తవంలో కొత్తగా తల్లి అయిన మహిళలకు అది చాలా కష్టమైన పని అన్నారు. కొత్తగా మాతృత్వం పొందిన వారు తిరిగి పనిలోకి వచ్చినప్పుడు వారికి చుట్టూ ఉన్నవారంతా పూర్తి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.
వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తీరిక లేకుండా ఉన్నా, ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం తప్పనిసరి అని దీపికా అర్థం చేసుకున్నారు. “నాకు నిద్ర చాలా ముఖ్యం. నేను ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినా ఇది వినేవారికి బోరింగ్‌గా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. నిద్ర, పోషకాహారం, వ్యాయామం – వీటికి నేను ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తా. ఐస్బాత్లు లేదా రెడ్‌లైట్ థెరపీ వంటివి మంచివే అయినా, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే నాకు అన్నింటి కంటే ముఖ్యమైనది” అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పని, జీవిత సమతుల్యత గురించి సినీ పరిశ్రమలో, సాధారణ ఉద్యోగులలో కొత్త చర్చకు తెర తీసే అవకాశం ఉంది.
