Vantara: అనంత్ అంబానీ ‘వంతారా’ అభయారణ్యం రహస్యాలు.. జియోహాట్‌స్టార్‌లో డాక్యుమెంటరీ
Vantara: రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతిపెద్ద వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారా. గుజరాత్‌లో వేలాది ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం, 2,000కు పైగా వివిధ రకాల జంతువులకు సురక్షితమైన ఆవాసంగా మారింది. ఈ అంతర్జాతీయ స్థాయి పునరావాస కేంద్రం గురించి అద్భుతమైన విశేషాలతో రూపొందించిన డాక్యుమెంటరీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘వంతారా సాంక్చురీ స్టోరీస్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ వేదికగా ప్రసారమవుతోంది. ‘సాంక్చురీ స్టోరీస్ సీజన్-1’ పేరుతో మొత్తం ఆరు ఎపిసోడ్‌లుగా దీనిని అందుబాటులోకి తెచ్చారు.
ఈ డాక్యుమెంటరీకి అమెరికాకు చెందిన ప్రఖ్యాత సాహసికుడు, టెలివిజన్ హోస్ట్ ఫారెస్ట్ గలంటే హోస్ట్‌గా వ్యవహరించారు. వంతారాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ సిరీస్‌లో, ఈ అభయారణ్యం బృందం పనిచేసే విధానాన్ని, జంతువుల పట్ల వారి నిబద్ధతను కళ్లకు కట్టినట్లు చూపించారు. వేటగాళ్ల బారిన పడి తీవ్రంగా గాయపడిన, లేదా నిరాదరణకు గురైన అరుదైన జంతువులను వంతారా బృందం ఎలా రక్షిస్తుంది, వాటికి అందించే అత్యాధునిక వైద్య సంరక్షణ, అలాగే పునరావాస సదుపాయాలను ఇందులో వివరంగా చూపించడం జరిగింది.
హోస్ట్ గలంటే ఈ సిరీస్‌పై స్పందిస్తూ, తాను ఇప్పటివరకు హోస్ట్ చేసిన షోలలో వంతారా డాక్యుమెంటరీ అత్యంత ప్రభావవంతమైంది అని పేర్కొన్నారు. మానవత్వం, వన్యప్రాణుల సంరక్షణకు వంతారా అందిస్తున్న సేవలను ఈ సిరీస్ ప్రపంచానికి చాటిచెబుతోంది. జంతు ప్రేమికులతో పాటు, డాక్యుమెంటరీ ప్రియులు తప్పక చూడవలసిన సిరీస్‌గా ఇది గుర్తింపు పొందుతోంది.
