Prabhas: జపాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇచ్చిన మాట కోసం అక్కడికి వెళ్తున్న ప్రభాస్
Prabhas: పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి విస్తరించింది. ముఖ్యంగా ‘సూర్యుడు ఉదయించే దేశం’ జపాన్‌లో మన డార్లింగ్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌తో జపాన్ ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన ‘సాహో’, ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 AD’ చిత్రాలతో అక్కడ తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. అక్కడి అభిమానుల ప్రేమను దృష్టిలో ఉంచుకుని ప్రభాస్ త్వరలోనే జపాన్ పయనం కానున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కల్కి 2898 AD’ జపాన్‌లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. వాస్తవానికి ఈ సినిమా విడుదల సమయంలోనే ప్రభాస్ జపాన్ వెళ్లి, అక్కడి ప్రేక్షకులతో సినిమాను వీక్షించాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో ఆయన కాలికి గాయం కావడం, నొప్పులు వేధించడంతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను నిరాశపరచకుండా, త్వరలోనే కలుస్తానని ఓ వీడియో ద్వారా మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారు. వచ్చే నెలలో ఆయన జపాన్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు. జపాన్ పర్యటన కోసం ఈ షూటింగ్ నుంచి కొద్దిరోజులు విరామం తీసుకోనున్నారు. అక్కడ అభిమానులతో గడిపి, తిరిగి వచ్చాక మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అవుతారు.
మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ పనులు కూడా వేగవంతం అయ్యాయి. ఈ నెలాఖరులోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని టాక్. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్‌ని పూర్తిగా మార్చుకునే పనిలో ఉన్నారు. జపాన్ పర్యటన ముగించుకొని వచ్చాక, ప్రభాస్ అటు కొత్త సినిమాల షూటింగ్‌లతో పాటు.. మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజాసాబ్’ ప్రచార కార్యక్రమాల్లోనూ బిజీ కానున్నారు. మొత్తానికి డార్లింగ్ షెడ్యూల్ రాబోయే రోజుల్లో ప్యాక్డ్ గా ఉండబోతోంది.
