Orry: భారీ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సోషల్ మీడియా స్టార్ ‘ఓరీ’
Orry: బాలీవుడ్ తారలతో స్నేహం, వెరైటీ ఫ్యాషన్, సోషల్ మీడియాలో నిత్యం హల్చల్.. ఇవన్నీ వినగానే ఠక్కున గుర్తొచ్చే పేరు ఓర్హాన్ అవత్రామణి అలియాస్ ‘ఓరీ’. నిత్యం సెలబ్రిటీల పార్టీల్లో సందడి చేసే ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఊహించని విధంగా ఓ భారీ వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా రూ. 252 కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఓరీకి సమన్లు జారీ చేయడం సినీ, సామాజిక మాధ్యమ వర్గాల్లో కలకలం రేపుతోంది.
గత మార్చి నెలలో మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ ఉన్న ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి దాదాపు 126.14 కిలోల మెఫెడ్రోన్ (MD) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 252 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసును ముంబై పోలీసులకు చెందిన యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) – ఘాట్కోపర్ యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారి, డ్రగ్స్ ట్రాఫికర్ అయిన మహ్మద్ సలీం మొహమ్మద్ సుహైల్ షేక్‌ను పోలీసులు దుబాయ్ నుంచి అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకువచ్చారు. విచారణలో భాగంగా పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, సలీం షేక్ పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లతో పాటు ‘ఓరీ’ పేరును కూడా ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు అసలు విషయాలను నిగ్గు తేల్చేందుకు ఓరీని విచారణకు పిలిపించారు. ముఖ్యంగా ముంబై, దుబాయ్‌లలో సలీం షేక్ నిర్వహించిన పలు రేవ్ పార్టీలలో ఓరీకి ఏమైనా సంబంధం ఉందా? అతనికి ఈ డ్రగ్స్ రాకెట్ గురించి ఏమైనా తెలుసా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు.
ప్రస్తుతానికి ఓరీని కేవలం విచారణ నిమిత్తం మాత్రమే పిలిపించామని, అతనిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాలేదని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. నిందితుడు సలీం చెప్పిన విషయాల్లో వాస్తవాలను ధృవీకరించుకోవడానికే ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత ఈ కేసులో ఓరీ పాత్ర ఉందా లేదా అనేది తేలనుంది. ఎప్పుడూ సరదా వీడియోలతో నవ్వించే ఓరీ, ఇలా సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో పేరు వినిపించుకోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
