Priyanka Chopra: తెలుగులో ఆ పని సొంతంగా చేస్తా.. మన హీరోయిన్లకు పోటీ ఇస్తున్న ప్రియాంక చోప్రా
Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు చెబితే చాలు ఇటు బాలీవుడ్ నుండి అటు హాలీవుడ్ వరకు అందరికీ సుపరిచితమే. అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా సత్తాను చాటిన ఈ ముద్దుగుమ్మ, చాలా కాలం తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక పోషించబోయే పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోందని టాక్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రియాంక స్వయంగా వెల్లడించిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంకను, తాజాగా ఓ నెటిజన్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “మేడమ్.. వారణాసి సినిమాలో మీ పాత్రకు తెలుగులో మీరే డబ్బింగ్ చెబుతున్నారా? లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని వాడుతున్నారా?” అని ప్రశ్నించాడు. దీనికి ప్రియాంకఇచ్చిన సమాధానం చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. “అవును.. నా పాత్రకు నేనే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. అందుకోసం ప్రత్యేకంగా తెలుగు భాషను కూడా నేర్చుకుంటున్నాను” అని క్లారిటీ ఇచ్చేసింది.
ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లు ఏళ్ల తరబడి ఇక్కడే సినిమాలు చేస్తున్నా, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి సాహసించరు. కనీసం చిన్న చిన్న పదాలు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది హాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండే ప్రియాంక చోప్రా, కేవలం ఒక సినిమా కోసం తెలుగు నేర్చుకుని, స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి సిద్ధపడటం అంటే మామూలు విషయం కాదు. ఆమె డెడికేషన్‌ను చూసి నెటిజన్లు “వావ్.. గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే ఇదేనేమో” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ‘వారణాసి’ సినిమాతో ప్రియాంక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
