The Family Man 3: ఓటీటీలోకి వచ్చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3
The Family Man 3: భారతీయ ఓటీటీ చరిత్రలోనే గేమ్ చేంజర్‌గా నిలిచిన వెబ్ సిరీస్‌లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ది ప్రత్యేక స్థానం. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ నటన, రాజ్ అండ్ డీకేల స్క్రీన్ ప్లే మాయాజాలం కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ తాజా సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది.
గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా మేకర్స్ భాషా భేదం లేకుండా అందరికీ రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా ఓటీటీలోకి ఈ సిరీస్ వచ్చేయడంతో ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. వీకెండ్లో బింజ్ వాచ్ చేయడానికి ఇంతకంటే మంచి ఆప్షన్ లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మొదటి సీజన్ ముంబై, ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో నడవగా, రెండవ సీజన్ చెన్నై నేపథ్యంలో సాగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మూడవ సీజన్ కథ మొత్తం ‘నార్త్ ఈస్ట్’ (ఈశాన్య రాష్ట్రాల) బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. చైనా సరిహద్దు వివాదాలు, అక్కడి రాజకీయ పరిస్థితుల చుట్టూ ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ తివారీ మరోసారి దేశాన్ని ఎలా కాపాడాడనేది ఉత్కంఠభరితంగా చూపించనున్నారు.
ఈ సీజన్ మరో ప్రధాన ఆకర్షణ విలన్. ‘పాతాళ్ లోక్’ సిరీస్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న జైదీప్ అహ్లవత్ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, జైదీప్ అహ్లవత్ వంటి ఉద్దండుల నటన ఈ సీజన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్ & డీకే మార్క్ టేకింగ్, ట్విస్టులు ఈ సీజన్లో కూడా హైలైట్‌గా నిలవనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? శ్రీకాంత్ తివారీ కొత్త మిషన్‌ను మీరూ ప్రైమ్ వీడియోలో చూసేయండి.
