Multi Starrer: బాలయ్య – శివన్న మల్టీస్టారర్ ఫిక్స్? స్టేజ్ మీదే ‘డబుల్ రెడీ’ అనేసిన బోయపాటి
Multi Starrer: టాలీవుడ్‌లో మాస్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ల తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న ‘అఖండ 2: తాండవం’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కేవలం సినిమా ప్రమోషన్‌కే కాకుండా, ఒక సంచలన ప్రకటనకు వేదికైంది.
ఈ వేడుకకు కన్నడ కంఠీరవ శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన మాట్లాడిన మాటలు సౌత్ ఇండియా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలయ్యతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. “బోయపాటి గారు డైరెక్ట్ చేస్తే, బాలయ్య గారితో కలిసి నటించడానికి నేను సిద్ధం” అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీనికి బాలకృష్ణ ఏమాత్రం ఆలోచించకుండా చిరునవ్వుతో “నేను కూడా రెడీ” అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అక్కడితో ఆగకుండా మైక్ అందుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి.. “ఒక్క రెడీ కాదు సార్.. డబుల్ రెడీ” అనడంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది.
ఇప్పటికే అఖండ 2 ట్రైలర్‌లో బాలయ్య ఉగ్రరూపం, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసి ఫ్యాన్స్ ఊగిపోతుంటే, ఇప్పుడు ఈ మల్టీస్టారర్ వార్త వారికి అదనపు కిక్ ఇచ్చింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజంగా కార్యరూపం దాల్చితే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇద్దరు అగ్ర హీరోలను బ్యాలెన్స్ చేస్తూ కథ సిద్ధం చేయడం కత్తి మీద సాము లాంటిది. స్క్రిప్ట్, కాల్షీట్స్ వంటి అనేక అంశాలు కుదిరితేనే ఇది సాధ్యమవుతుంది.
ప్రస్తుతానికి మాత్రం ‘అఖండ 2’ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది. ముంబై, వైజాగ్ ఈవెంట్స్ తర్వాత కర్ణాటకలో కూడా సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుండటం చూస్తుంటే, బాలయ్య ఈసారి పాన్ ఇండియా స్థాయిలో గట్టిగానే సౌండ్ చేసేలా కనిపిస్తున్నారు. మొత్తానికి ‘అఖండ 2’ రిలీజ్ తర్వాత బోయపాటి ఫోకస్ ఈ క్రేజీ మల్టీస్టారర్ పైకి మళ్లుతుందేమో వేచి చూడాలి.
