Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ ఓటీటీ సందడి షురూ: ఎప్పుడంటే?
Mass Jathara: రవితేజ అభిమానులకు, మాస్ యాక్షన్ ప్రియులకు ఆనందాన్నిచ్చే వార్త! మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఓటీటీ వేదికపైకి రాబోతోంది. భాను భోగవరపు దర్శకత్వంలో నవంబర్ 1వ తేదీన విడుదలై, థియేటర్లలో మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లపై సందడి చేసేందుకు సిద్ధమైంది.
అధికారిక ప్రకటన ప్రకారం, ‘మాస్ జాతర’ చిత్రం నవంబర్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా ఓ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేని ప్రేక్షకులు లేదా మళ్లీ చూడాలనుకునే ఫ్యాన్స్… ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ తరుణంలో, ఓటీటీ విడుదల తేదీ లాక్ అవ్వడం సంతోషకరం. గత కొన్ని రోజులుగా దీని ఓటీటీ ప్రవేశంపై సోషల్ మీడియాలో వివిధ రకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ ధృవీకరణతో ఆ పుకార్లకు తెరపడింది.
ఈ చిత్రంలో రవితేజ లక్ష్మణ్ భేరి అనే నిజాయతీపరుడైన రైల్వే పోలీస్ ఎస్ఐ పాత్రను పోషించారు. తన కళ్ల ముందు అన్యాయం జరిగితే, అది తన అధికార పరిధి కాకపోయినా వదిలిపెట్టకుండా దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించే దూకుడు స్వభావం కలవాడు లక్ష్మణ్. వరంగల్‌లో పనిచేసే సమయంలో రాజకీయ అండదండలు ఉన్న ఒక మంత్రి కొడుకు అక్రమాలకు గట్టిగా బుద్ధిచెప్పి వార్తల్లో నిలుస్తాడు.
దీని కారణంగా అతడు అల్లూరి జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతమైన అడవివరం రైల్వేస్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. కొండల మధ్య విస్తరించి ఉన్న ఆ ప్రాంతాన్ని శివుడు (నవీన్ చంద్ర) అనే గంజాయి స్మగ్లర్ శాసిస్తుంటాడు. స్థానిక రైతులను ఉపయోగించి శీలావతి రకం గంజాయిని పండించి, దాన్ని కోల్‌కతాకు రహస్యంగా తరలిస్తూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు.
అడవివరం రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టిన లక్ష్మణ్, శివుడి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంటాడు. జిల్లా ఎస్పీ నుంచి రాజకీయ నాయకుల వరకు అందరి అండదండలున్న శివుడిని ఓ సామాన్య రైల్వే ఎస్ఐ ఎలా ఎదుర్కొన్నాడు? గంజాయి సామ్రాజ్యాన్ని ఎలా కూలదోశాడు? హీరోయిన్ తులసి (శ్రీలీల) మరియు హనుమాన్ భేరి (రాజేంద్ర ప్రసాద్) పాత్రలు కథ మలుపులో ఏ విధంగా సహాయపడ్డాయి? అన్నదే ఈ సినిమా అసలు కథ. రవితేజ మార్క్ యాక్షన్, కామెడీ, ఎమోషన్స్‌తో నిండిన ఈ సినిమా నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
