Aamir Khan: బాక్సాఫీస్ నంబర్ల మాయ.. సినిమా ఫలితాలను వాటితో అంచనా వేయడంపై అమీర్ ఖాన్ ఆవేదన
Aamir Khan: బాలీవుడ్‌లో దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అగ్ర నటుడు ఆమిర్ ఖాన్, ప్రస్తుత సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ నంబర్లకు ఇస్తున్న అధిక ప్రాధాన్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కలెక్షన్ల ఆధారంగానే ఒక సినిమా విజయాన్ని అంచనా వేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
గతంలో ఒక సినిమా బాగుందంటే అందులోని కథ, అద్భుతమైన సన్నివేశాలు, మనసుకు హత్తుకునే పాటలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆమిర్ ఖాన్ గుర్తు చేశారు. “బాక్సాఫీస్ నంబర్ల విషయంలో దర్శక నిర్మాతలు తప్పనిసరిగా పారదర్శకత పాటించాలి. ఎన్ని స్క్రీన్లలో సినిమా విడుదలైంది, ఎంత వసూళ్లు వచ్చాయి అనే పూర్తి సమాచారం ప్రేక్షకులకు తెలియాలి. విదేశాల్లో ఇప్పటికే ఈ పద్ధతి అమల్లో ఉంది” అని ఆయన నొక్కి చెప్పారు.
గతంలో తాను కలెక్షన్ల గురించి పెద్దగా ఆలోచించేవాడిని కానని, కానీ ఇప్పుడు ప్రేక్షకులలో ఈ నంబర్ల గురించి ఆసక్తి పెరిగినందున, తాను కూడా వాటి గురించి ఆలోచిస్తున్నట్లు ఆమిర్ ఖాన్ తెలిపారు. అయినప్పటికీ, కేవలం సంఖ్యల ఆధారంగా ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయించడం సరికాదని ఆయన పునరుద్ఘాటించారు. “ఎన్ని అంచనాలు ఉన్నా, ఎన్ని కలెక్షన్లు వచ్చినా… మంచి కథ, బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలను మాత్రమే ప్రేక్షకులు శాశ్వతంగా గుర్తుంచుకుంటారు” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా, ఇటీవల మృతి చెందిన బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్రతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. ధర్మేంద్రను కలవడం తన జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి అని చెబుతూ, తన చిన్న కుమారుడిని కూడా ఆయన వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపారు. సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ, తనకు చిన్నప్పటి నుంచే మంచి కథలంటే చాలా ఇష్టమని, అదే తనను మంచి చిత్రాల వైపు నడిపించిందని చెప్పారు. “నేటి కాలంలో చాలా మంది ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలను ఎంచుకుంటున్నారు. కానీ, నేను ఎప్పుడూ మార్కెట్ పోకడలను అనుసరించి నా సినిమా కథలను ఎంపిక చేసుకోలేదు” అని ఆయన స్పష్టం చేశారు.
