Dil Raju: బాలీవుడ్‌పై దిల్ రాజు ఫోకస్.. అక్షయ్, సల్మాన్ ఖాన్‌లతో భారీ చిత్రాలు
Dil Raju: తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు ఇకపై హిందీ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) పతాకంపై బాలీవుడ్‌లోని అగ్ర తారలతో వరుసగా చిత్రాలను నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వచ్చే ఏడాది (2026) తమ సంస్థ నుంచి దాదాపు ఆరు చిత్రాలు విడుదల కానున్నాయని దిల్ రాజు స్వయంగా వెల్లడించారు.
ముఖ్యంగా హిందీలో ఒక సంచలన ప్రాజెక్ట్‌కు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. తమ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి హిందీ రీమేక్‌ను అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో నిర్మించనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నాయని, 2026లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి, అదే ఏడాది విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాకుండా, మరో ప్రముఖ నిర్మాత శిరీష్ మాట్లాడుతూ… బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తమ SVC సంస్థ మరో భారీ చిత్రాన్ని నిర్మించనుందని ప్రకటించారు. తెలుగులో కూడా తమ సంస్థ నుంచి విజయ్ దేవరకొండ – కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ ఏడాది (2025) ‘స్కై ఫోర్స్’, ‘కేసరి ఛాప్టర్ 2’, ‘జాలీ ఎల్ఎల్‌బీ 3’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఆయన వైవిధ్యమైన ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, ఆయన దర్శకుడు సాజిద్ ఖాన్తో కలిసి మరో భారీ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నట్లు బీ-టౌన్ వర్గాలు చెబుతున్నాయి.
పేరు ఇంకా ఖరారు కానీ ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జూలైలో చిత్రీకరణ ప్రారంభమవుతుందని బాలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘హేయ్ బేబీ’, ‘హౌస్‌ఫుల్’ వంటి సూపర్ హిట్‌లను అందించిన అక్షయ్ – సాజిద్‌ల విజయవంతమైన కాంబినేషన్ ఈసారి తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
