Samantha Ring Story: సమంత డైమండ్ రింగ్ వెనుక మొఘల్ యుగం చరిత్ర
Samantha Ring Story: సినిమా తారలు సమంత, రాజ్‌ల వివాహ వేడుక సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య గొప్ప చర్చనీయాంశమైంది. వీరి పెళ్లికి సంబంధించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పెళ్లిలో వీరిద్దరూ ధరించిన దుస్తులు, ఆభరణాలపై అందరి దృష్టి పడింది. ఈ జంట వేసుకున్న కాస్ట్యూమ్స్ గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ, సమంత వేలికి ఉన్న అరుదైన వజ్రపు ఉంగరం (డైమండ్ రింగ్) ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది.
సమంత ఎంచుకున్న ఈ ఉంగరం సాధారణమైంది కాదు. ఇది ‘పోట్రెయిట్ కట్’ డైమండ్ రింగ్ అని జ్యువెలరీ నిపుణులు వెల్లడించారు. ఈ అరుదైన కట్ ఉంగరాలను మొఘల్ సామ్రాజ్యం కాలంలో మొట్టమొదటగా తయారు చేశారని చెబుతారు.
జ్యువెలరీ డిజైనర్ అభిలాషా భండారి దీని గురించి వివరిస్తూ, పోట్రెయిట్ కట్ వజ్రాన్ని బలం, తేజస్సు, స్వచ్ఛమైన మనస్తత్వానికి ప్రతీకగా భావిస్తారని తెలిపారు. ఈ తరహా వజ్రాలను ఒక ప్రత్యేక పద్ధతిలో కట్ చేసి, పలుచని గాజు పలకలా ఉండేలా తీర్చిదిద్దుతారని అన్నారు. ఈ రింగుల తయారీ చాలా అరుదుగా జరుగుతుందని, అందుకే ఇవి అంత ప్రత్యేకమైనవని ఆమె పేర్కొన్నారు.
ఈ పోట్రెయిట్ కట్ ఉంగరాలకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం, తాజ్ మహల్‌ను కట్టించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్‌కు సైతం ఇలాంటి ఉంగరం అంటే ఎంతో ఇష్టమని తెలుస్తోంది. సమంత ఈ ఏడాది జనవరి నుంచే ఈ రింగ్‌ను ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కానీ, వీరి వివాహం నేపథ్యంలో ఇది మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఇక, బాలీవుడ్ ప్రముఖ నటీమణులు ధరించిన నిశ్చితార్థపు ఉంగరాల కంటే సమంత ఎంపిక భిన్నంగా ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. గతంలో ఆలియా భట్ ఓవల్ షేప్ డైమండ్, ప్రియాంక చోప్రా క్లాసిక్ కుషన్ కట్ వజ్రం, కత్రినా కైఫ్ రాచరిక స్ఫూర్తితో రూపొందించిన నీలం ఉంగరాలను ఎంచుకున్నారు. కానీ, ఈ తారల కంటే భిన్నంగా, చరిత్రలో చోటు చేసుకున్న అరుదైన కట్ ఉంగరాన్ని సమంత ఎంపిక చేసుకోవడం ఆమె ప్రత్యేకతను చాటుతోంది. పెళ్లిలో ఎరుపు రంగు చీరలో సంప్రదాయ ఆభరణాలైన చోకర్ నెక్లెస్, పెద్ద చెవిపోగులతో ఆమె ఎంతగానో మెరిసిపోయారు.
