Family Man Season 4: ఫ్యామిలీ మ్యాన్ 3 ముగింపు సీక్రెట్ అదే.. సీజన్ 4 పై రాజ్ డీకే కీలక అప్‌డేట్
Family Man Season 4: అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మూడవ సీజన్ ముగింపుపై ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తి, ప్రశ్నలకు దర్శకులు రాజ్ అండ్ డీకే తాజాగా స్పష్టత ఇచ్చారు. శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్‌పాయ్) గాయాల పాలవ్వడం, రుక్మ (జైదీప్ అహ్లావత్), మీరా (నిమ్రత్ కౌర్)ల పరిస్థితి గురించి సిరీస్ ముగింపులో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై ప్రేక్షకులు పెదవి విరిచారు.
ఈ విషయమై దర్శకులు స్పందిస్తూ, వాస్తవానికి మూడవ సీజన్‌ను రెండు భాగాలుగా తీయాలని తాము ముందుగా అనుకున్నామని వెల్లడించారు. అందుకే, సైనికులను శ్రీకాంత్ తివారి కాపాడిన కీలక పాయింట్ దగ్గర కథను ఆపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ అంతుచిక్కని ప్రశ్నలన్నింటికీ తర్వాతి భాగంలో సమాధానాలు దొరుకుతాయని హామీ ఇచ్చారు. “ప్రతి సీజన్ ముగిసిన తర్వాత ప్రేక్షకులు తమకు తోచిన థియరీలను, ఊహాగానాలను చెబుతారు. ఈ సీజన్ విషయంలోనూ అదే జరుగుతోంది. మా సిరీస్ గురించి ఇంత మంది ఆలోచించడం మాకు సంతోషంగా ఉంది” అని రాజ్ అండ్ డీకే అన్నారు.
సీజన్ 4 విడుదల గురించి వారు మాట్లాడారు. నాలుగవ సీజన్ కోసం ఎక్కువ సమయం పట్టదని, చాలా త్వరగానే ఉంటుందని వెల్లడించారు. అయితే, విడుదల తేదీకి సంబంధించిన వివరాలను పంచుకోవద్దని అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం సీజన్ 4 కథ, ఇతర విషయాలపై తాము తీవ్రంగా పనిచేస్తున్నామని, ముగింపుపై ఉన్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని 100% మనసు పెట్టి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు.
ప్రతి సీజన్ కోసం తాము విస్తృతమైన పరిశోధన చేస్తామని దర్శకులు తెలిపారు. ఉదాహరణకు, సీజన్-1లో కాశ్మీర్ అంశం, సీజన్-2లో తమిళ రెబల్ గ్రూప్, మరియు సీజన్-3లో ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలు వంటి ప్రతి విషయంపైనా లోతైన పరిశోధన చేసి, స్థానికులను కలిసి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతే సన్నివేశాలను రాసుకున్నట్లు వివరించారు.
ఇక, ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ సిరీస్‌ల క్రాస్ ఓవర్ అనుకోకుండా జరిగిందని వారు తెలిపారు. ‘ఫర్జీ’ షూటింగ్ సమయంలోనే శ్రీకాంత్ తివారి ఇల్లు కనిపించడంతో, వెంటనే ఒక సన్నివేశాన్ని రాసుకుని, అందుబాటులో ఉన్నవారితో ఆ సీన్‌ను చిత్రీకరించామని చెప్పారు. ఇప్పుడు ‘ఫర్జీ’లోని మైఖేల్ (విజయ్ సేతుపతి) పాత్రను ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 4లోకి తీసుకొస్తున్నట్లు పరోక్షంగా తెలిపారు.
