Rana Daggubati: సినీ పరిశ్రమలో ‘వర్కింగ్ అవర్స్’ వివాదం.. రానా, దుల్కర్ సల్మాన్ ఏమన్నారంటే?
Rana Daggubati: గత కొంతకాలంగా దేశీయ చిత్ర పరిశ్రమలో ‘వర్కింగ్ అవర్స్’ గురించి జరుగుతున్న చర్చ ఇటీవల నటి దీపికా పదుకొణె వివాదంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగుల మాదిరిగా నటీనటులకు కూడా ఎనిమిది గంటల పని విధానం సరిపోతుందా? లేదా? అనే దానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ఈ అంశంపై అగ్ర నటులు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారు.
నటుడిగా తన అనుభవాన్ని పంచుకుంటూ రానా దగ్గుబాటి, సినిమారంగం ఇతర వృత్తుల కంటే పూర్తిగా భిన్నమైందని స్పష్టం చేశారు. “నటన అనేది కేవలం ఉద్యోగం కాదు. ఇది ఒక జీవనశైలి. ఈ జీవనశైలిని స్వీకరించాలా, లేదా అనేది పూర్తిగా ఎవరికి వారే తీసుకునే నిర్ణయం” అని రానా అన్నారు.
“ఒక ఆఫీసులో ఎనిమిది గంటలు కదలకుండా కూర్చొని పని చేస్తే అద్భుతమైన అవుట్‌పుట్ రావచ్చు. కానీ నటన అలాంటి ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ గొప్ప సన్నివేశాలు రావాలంటే, ప్రతి విభాగంలో నటీనటులు నిమగ్నమై పనిచేయాలి. అందువల్ల, ‘ఇన్ని గంటలే పని చేయాలి’ అని కచ్చితంగా నిర్వచించడం చాలా కష్టం” అని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు, నటుడు దుల్కర్ సల్మాన్ దక్షిణాదిలోని వివిధ పరిశ్రమల్లో పని విధానం ఎలా ఉంటుందో విశ్లేషించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో షూటింగ్ మొదలయ్యాక ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉంటుందని దుల్కర్ ప్రస్తావించారు.
అయితే, “తెలుగులో ‘మహానటి’ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సాయంత్రం ఆరు గంటలకే ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్లిపోయేవాడిని. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ రెండు ఆదివారాలు కూడా సెలవు ఇస్తారు” అని ఆయన పేర్కొన్నారు. దీనిపై తన అభిప్రాయం చెబుతూ, “ఒక రోజు అదనంగా షూటింగ్ చేయాల్సి వచ్చే కంటే, రోజూ కొన్ని గంటలు అదనంగా పనిచేయడం సులభమైన విషయం” అని దుల్కర్ సల్మాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పని గంటలపై అగ్ర తారలు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపాయి.
