Pushpa 2 Stampede: ‘పుష్ప 2’ తొక్కిసలాట బాధితుడికి నిరంతర సాయం.. బన్ని వాస్ వెల్లడి
Pushpa 2 Stampede: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న కొన్ని ముఖ్య విషయాలపై అగ్ర నిర్మాతలు బన్ని వాస్, కేఎల్ దామోదర్ ప్రసాద్ స్పందించారు. ఇటీవల విడుదల కాబోతున్న ‘ఈషా’ అనే హారర్ థ్రిల్లర్ గ్లింప్స్ వేదికగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు.
‘పుష్ప 2’ సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, అతడి కుటుంబానికి అందిస్తున్న ఆర్థిక సహాయం గురించి నిర్మాత బన్ని వాస్ కీలక విషయాలు వెల్లడించారు. దిల్ రాజుతో సహా చిత్ర పరిశ్రమలోని పెద్దలంతా ఈ వ్యవహారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. సహాయాన్ని పంపిణీ చేసే విషయంలో ఒక వ్యవస్థీకృత విధానాన్ని అనుసరిస్తున్నామని బన్ని వాస్ వివరించారు.
ఈ విధానంలో భాగంగా, గాయపడిన బాలుడి వైద్య ఖర్చుల కోసం ఎంత కేటాయించాలి, బాధిత కుటుంబానికి నెలవారీ ఆర్థిక సహాయం ఎంత అందాలి, మిగిలిన నిధిని ఎక్కడ భద్రపరచాలి అనే విషయాలన్నీ పారదర్శకంగా నడుస్తున్నాయన్నారు. “బాధిత కుటుంబం వైపు నుంచి ఏదైనా సందేహం ఉన్నా, ప్రస్తుతం అందిస్తున్న సహాయం సరిపోవడం లేదని భావించినా, వారి పెద్ద మనుషులతో వచ్చి చర్చించవచ్చు.
సమస్యను పరిష్కరించడానికి లేదా మా వైపు నుంచి ఏదైనా దిద్దుబాటు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ చర్చలన్నింటికీ ఇండస్ట్రీ పెద్దలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు,” అని బన్ని వాస్ స్పష్టం చేశారు. అయితే, ఆ సాయం గురించి మరింత లోతుగా మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదని ఆయన ముగించారు.
