Raashii Khanna: సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రాశీ ఖన్నా.. ఆఫర్లకు కొదవలేదు, హిట్ మాత్రం దొరకట్లేదు
Raashii Khanna: అందం, అభినయం ఉన్నప్పటికీ, కథానాయిక రాశీ ఖన్నా గత ఆరేళ్లుగా టాలీవుడ్‌లో సరైన హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘ప్రతి రోజు పండగే’ తర్వాత తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లు కొంతవరకు ఆకట్టుకున్నా, ‘యోధ’, ‘ది సబర్మతి రిపోర్ట్’, ‘120 బహుదూర్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే, కోలీవుడ్‌లో మాత్రం ఆమెకు కొంత ఊరట లభించింది. ఇటీవల ‘ఆరణ్మనై 4’ చిత్రంలో గ్లామరస్‌గా కనిపించి కమర్షియల్ హిట్‌ను అందుకొని తమిళ ప్రేక్షకులకు చేరువయ్యారు.
గత ఏడాది ‘ది సబర్మతి రిపోర్ట్’ నుంచి మొదలైన వరుస ఫ్లాపులు రాశీ ఖన్నా ఇమేజ్‌ను కొంతవరకు దెబ్బతీశాయి. మరీ ముఖ్యంగా, ఈ సంవత్సరంలో ఆమె ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాపులు చేరాయి. నార్త్ నుంచి సౌత్ వరకు సినిమాలు చేసినా ఒక్క విజయం కూడా ఆమెకు దక్కలేదు. తమిళంలో ‘అగత్యా’, తెలుగులో ‘తెలుసు కదా’, హిందీలో ‘120 బహుదూర్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
అయినప్పటికీ ఈ మూడు ప్రధాన సినీ పరిశ్రమలు రాశీకి మరో అవకాశం కల్పించడం గమనార్హం. హిందీలో ఒక పెద్ద హిట్ లేకపోయినా, ఆమెకు ఆఫర్లకు మాత్రం కొదవలేదు. ప్రస్తుతం ఆమె ‘ఫర్జీ 2’ వెబ్ సిరీస్‌తో పాటు, ‘తలాఖో మే ఏక్’, ‘బ్రిడ్జ్ ఫిల్మ్స్’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాగే, తమిళంలో సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న ‘రౌడీ అండ్ కో’లో కథానాయికగా ఖరారు అయ్యారు. ఇక రాశీ ఖన్నా తెలుగులో నటిస్తున్న ఏకైక భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమె ‘శ్లోక’ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో శ్రీలీల మెయిన్ లీడ్‌గా ఉన్నప్పటికీ, రాశీ ఖన్నా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
రాశీ ఖన్నాకు మెగా హీరోలతో ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. గతంలో ఆమె నటించిన ‘సుప్రీమ్’ (సాయి ధరమ్ తేజ్), ‘తొలి ప్రేమ’ (వరుణ్ తేజ్), ‘ప్రతి రోజు పండగే (సాయి ధరమ్ తేజ్)’ వంటి చిత్రాలు భారీ విజయాలుగా నిలిచాయి. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా హిట్ అయితే, ఈ సెంటిమెంట్ నిజమని మరోసారి రుజువైనట్లే. ఈ సక్సెస్ ఆమె కెరీర్‌కు ఎలాంటి మలుపు ఇస్తుందో తెలియాలంటే వచ్చే వేసవి వరకు ఎదురుచూడక తప్పదు.
